ఆంధ్రప్రదేశ్ సమాచార ప్రచార శాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులో ఓ వ్యక్తి గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. పేర్ని నాని వస్తున్న సమయంలో జేబులో నుంచి టాపీ తీసి పొడిచాడు. అయితే, అందులో దాడి చేసిన వ్యక్తి ముఖం, మంత్రి ముఖం రెండూ కనిపించడం లేదు. నవంబర్ 29న ఉదయం మచిలీపట్నంలో ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు అతడిని పట్టుకొని నిలువరించారు. మంత్రిపై దాడి చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మంత్రి కాళ్ల మీద పడుతున్నట్లు నటించి.. దాడికి యత్నించాడు. మంత్రి అనుచరులు అప్రమత్తమవడంతో పేర్ని నాని తృటిలో తప్పించుకున్నాడు. అనంతరం తాపీ మేస్త్రి నాగేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడికి కోర్డు రిమాండ్ విధించింది.
మంత్రి పేర్నినాని తల్లి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో నవంబర్ 29న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెద్దకర్మ కార్యక్రమాల అనంతరం.. అందరూ భోజనాలకు బయలుదేరారు. మంత్రి పేర్ని నాని.. తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడేందుకు గేట్ వద్దకు వచ్చారు. అదే సమయంలో నాగేశ్వరరావు మంత్రి వద్దకు వచ్చి, కాళ్లు మొక్కుతున్నట్లు నటించాడు. తాపీతో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అతడిని వెనక్కి లాగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.