హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: రహస్యంగా తిరుమల చేరుకున్న ఏపీ మంత్రి

Kodali Nani: రహస్యంగా తిరుమల చేరుకున్న ఏపీ మంత్రి

మంత్రి కొడాలి నాని (ఫైల్)

మంత్రి కొడాలి నాని (ఫైల్)

Kodali Nani in Tirumala: కొందరు బీజేపీ నేతలు సీఎం జగన్ సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు ఇవ్వాలని కోరుతున్నారనే అంశంపై స్పందించిన కొడాలి నాని.. ముందు మోదీని సతీసమేతంగా ఆలయాలకు వెళ్లమని చెప్పాలని వ్యాఖ్యానించారు.

  ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే శ్రీవారిని దర్శించుకోవాలని టీడీపీ, బీజేపీతోపాటు పలువురు స్వామిజీలు డిమాండ్ చేస్తుంటే.. ఆయన డిక్లరేషన్ ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ అంశంలో విపక్షాలపై విమర్శలు గుప్పించి వివాదాలు కూడా కొనితెచ్చుకున్నారు మంత్రి కొడాలి నాని. సీఎం జగన్ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. ఇలాంటి సమయంలో మంత్రి కొడాలి నాని తిరుమల చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.

  సీఎం జగన్ తిరుమల చేరుకోవడానికి కొద్ది గంటల ముందే మంత్రి కొడాలి నాని తిరుమలకు వచ్చారు. ఆయన తిరుమలకు వస్తున్నారని ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. ప్రోటోకాల్ అధికారులకు సైతం మంత్రి కొడాలి నాని తిరుమల పర్యటన గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కేవలం కొద్దిమంది స్నేహితులతో కలిసి తిరుమల చేరుకున్న మంత్రి కొడాలి నాని.. డిక్లరేషన్ వివాదంపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు.

  శ్రీవారి దయ వల్లే జగన్ సీఎం అయ్యారని అన్నారు. కొందరు బీజేపీ నేతలు సీఎం జగన్ సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు ఇవ్వాలని కోరుతున్నారనే అంశంపై స్పందించిన కొడాలి నాని.. ముందు మోదీని సతీసమేతంగా ఆలయాలకు వెళ్లమని చెప్పాలని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు బీజేపీ చీఫ్ అయ్యాకే ఆలయాలపై దాడులు పెరిగాయని అన్నారు. అందరినీ సమానంగా పరిపాలిస్తానని సీఎంగా జగన్ ప్రమాణం చేశారని.. బీజేపీ ఉత్తుత్తి బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు. మరోవైపు సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో కొడాలి నాని కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kodali Nani

  ఉత్తమ కథలు