ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీలో మంత్రి, మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి కరోనా బారినపడ్డారు. తాజాగా జరిపించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు, మంత్రి నాని మిత్రుడు, విజయవాడ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ( Vangaveeti Radha) సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కన్పించగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన కూడా ఏఐజీలో చేరి చికిత్స పొందుతున్నారు. రాధా ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరు కాగా.. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొన్నారు. వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని రాధా సూచించారు. నాని, రాధాలతో కలిసున్నవారిలో ఇంకొందరు ఆస్పత్రుల్లో చేరే అవకాశాలున్నాయి.
ఏపీ ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం ఒక్కరోజు లోనే 1,831 కొత్త కేసులు వచ్చాయి. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం జగన్ సర్కారు నైట్ కర్ఫ్యూ ను ప్రకటించడం తెలిసిందే. ఏపీలో ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కాగా ఈ నెలలో వచ్చే సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ కరోనా పై చూపే అవకాశం ఉంది. దీంతో పండగ రోజుల్లో కరోనా కేసులు ఎక్కువ రాకుండా ఉండాలని ప్రజలను ప్రభుత్వ వర్గాలు, ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Coronavirus, Covid, Kodali Nani, Omicron, Vangaveeti Radha