హడావిడిగా హైకోర్టును విభజించి అమరావతికి వెళ్లమంటే ఎలా అని ఏపీ న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఏపీ న్యాయవాదుల్లో గందరగోళం నెలకొంది. సరైన వసతులు లేకుండా అమరావతికి వెళ్లిపోమని అంటే ఎలా ? అంటూ ఏపీ న్యాయవాదులు హైదరాబాద్ హైకోర్టు ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. తగిన సమయం ఇవ్వకుండా హడావిడి వెళ్లిపొమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. అరకొర వసతులతో ఏపీలో హైకోర్టు ఎలా పని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బెంచ్ దిగి చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయనను కలిసి ఏపీ న్యాయవాదులు తమ సమస్యలను వివరించారు.
ఇప్పటికప్పుడు ఏపీకి వెళ్లలేమని న్యాయవాదులు ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో ఇంకా కొత్త భవనం సిద్ధం కాలేదంటూ ఏపీ న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఉమ్మడి కేసులపై ఇంకా స్పష్టం లేదని వివరించారు. సిబ్బంది, దస్త్రాల విభజన ఇంకా జరగలేదని అన్నారు. మరోవైపు అమరావతిలో కొత్త హైకోర్టు భవనం అందుబాటులోకి రావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని హైకోర్టుగా ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కోర్టు వర్గాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
ఒకవేళ క్యాంప్ ఆఫీస్‌లో కోర్టు నిర్వహణ సాధ్యం కాకపోతే... హైదరాబాద్‌లోనే కొద్దిరోజులు ఏపీ హైకోర్టు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆవరణలోనే స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, High Court, Hyderabad, Telangana