విశాఖలో అరెస్టయిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ వ్యవహారంపై 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సుధాకర్ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ప్రస్తావన లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదన్న హైకోర్టు... దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి తమకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని... అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది.
నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో తమకు పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై బహిరంగ ఆరోపణలు చేసిన సుధాకర్‌ను ఏపీ సర్కార్ విధుల నుంచి తప్పించింది. ఇక గత శనివారం విశాఖ రోడ్లపై డాక్టర్ సుధాకర్ హల్ చల్ చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. సుధాకర్ మానసిక స్థతి సరిగ్గా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో మెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. శుక్రవారం విచారణ జరిపి తాజా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తీరును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తప్పుబట్టింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.