రాజమండ్రి జైలులో పలువురు ఖైదీలకు హెచ్ఐవీ వ్యాధి సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజమండ్రిలో జైలులో దాదాపు 1500 మంది ఖైదీలు ఉండగా... వారిలో 27 మంది హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్నట్టు అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్న వారికి అందిస్తున్న వైద్య సేవల వివరాలు అందించాలని ఆదేశించింది. జైలులో ఇంత పెద్ద స్థాయిలో హెచ్ఐవీ రోగులు ఎలా ఉన్నారని ప్రభుత్వ తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. జైలుకు వచ్చిన తరువాత ఎవరికైనా ఈ వ్యాధి సోకిందా అని ప్రశ్నించింది. అదే జరిగితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. హెచ్ఐవీ రోగులను గుర్తించి ఇతర ఖైదీలతో కలవకుండా వేరుగా ఉంచుతామన్న ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనను కూడా హైకోర్టు తప్పుబట్టింది. అలాంటి చర్యలు సరికాదని వ్యాఖ్యానించింది. మరోవైపు జైలుకు వచ్చిన తరువాత ఎనిమిది మంది ఖైదీలకు హైచ్ఐవీ సోకినట్టు సమాచారం.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.