మద్యపాన నిషేధమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా మద్యం ధరలను పెంచడంతో వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దుకాణాల సంఖ్యను కూడా పెద్ద మొత్తంలో తగ్గించేసింది. అంతేకాదు ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ దొరక్కపోవడంతో.. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏరులై పారుతోంది. అక్రమార్కులపై ఉక్కుపాదం రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో తనిఖీలు ముమ్మరం చేశారు. నిత్యం భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుభవార్త చెప్పింది. గతంలో మాదిరే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి 3 మద్యం సీసాలను తీసుకురావొచ్చని స్పష్టం చేసింది.
ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. పోలీసులు, ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారులు మద్యం సీజ్ చేస్తున్నారని పిటిషనర్లు వాపోయారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం.. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఏపీలో ఉన్న పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగినట్లు అయింది. లోకల్ బ్రాండ్స్‌పై మండిపడుతున్న మద్యం ప్రియులు ఇకపై పక్క రాష్ట్రాల నుంచి నచ్చిన బ్రాండ్లను (3 బాటిళ్లు) తెచ్చుకునే అవకాశం లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Liquor sales, Liquor shops