ఏపీలో ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మొత్తం1013 పిటిషన్లకు సంబంధించి బిల్లుల్ని సర్కారు చెల్లించాల్సిందేనని, నాలుగు వారాల్లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల్లో 20 శాతం తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం గతంలో సర్క్యులర్ జారీ చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. బకాయిలను 12 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా చెల్లించాలని తుది తీర్పులో ఆదేశించింది. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించిన బిల్లుల్లో పెండింగ్ అమౌంట్ కు కూడా 12 శాతం వడ్డీని కలిపి కట్టాలని కోర్టు స్పష్టం చేసింది.
చంద్రబాబు హాయంలో చేసిన ఉపాధి హామీ పనులు, ఇతర కాంట్రాక్ట్ పనులకు సంబంధించి జగన్ సర్కారు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘవాదనలు నడిచాయి. సోమవారంతో సదరు వాదనలు పూర్తయ్యాయి. విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లుల్ని ఆపినందుకుగానూ వడ్డీతో సహా అసలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ల తరఫు లాయర్లు కోరారు. అందుకు జడ్జి సుముఖత వ్యక్తం చేసినట్లు మంగళవారం తీర్పు ద్వారా వెల్లడైంది.
కోర్టులో కేసులు కొనసాగుతుండగా, పలువురు పిటిషనర్లకు ప్రభుత్వం నిధులు చెల్లిస్తూ వచ్చింది. అయితే.. గత విచారణ సమయంలో పంచాయితీరాజ్‌శాఖ చెప్పేది ఒకలా, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో వివరాలు మరోలా ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చివరికి ఇవాళ పెండింగ్ బిల్లలు, సగం చెల్లించిన వాటికి కూడా 12 శాతం వడ్డీతో కట్టేయాలని తీర్పు చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, AP High Court, Mnregs