AP GRAM PANCAHAYAT ELECTIONS SEC NIMMAGADDA RAMESH KUMAR SUSPENDS JOINT DIRECTOR SK
Andhra Pradesh: ఎస్ఈసీ జేడీపై వేటు.. ఎన్నికల సంఘంలో ఏం జరుగుతోంది?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్ ఫోటో)
Andhra Pradesh: సాయి ప్రసాద్ తీరును క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తున్నామని.. ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఆయన చర్యలున్నాయని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 243 రెడ్‌విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ని తొలగిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై రచ్చ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై వేటు వేశారు. 30 రోజుల పాటు సెలవులపై వెళ్లడమే గాక..ఇతర ఉద్యోగులు సైతం సెలవులపై వెళ్లాలా ప్రభావితం చేశారని.. ఆయన్ను విధుల నుంచి తొలగించారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో.. జనవరి 9 నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని సీనియర్ ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోరాదని ఎస్ఈసీ ఇదివరకే సూచించింది.
కానీ ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ మాత్రం 30 రోజుల పాటు సెలవులు పెట్టారు. అంతేకాదు ఇతర ఉద్యోగులను కూడా ప్రభావితం చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సాయి ప్రసాద్ తీరును క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తున్నామని.. ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఆయన చర్యలున్నాయని ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 243 రెడ్‌విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ని తొలగిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ విధులు చేపట్టడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఎస్ఈసీ.
రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 8న షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనవరి 23న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. 27న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. జనవరి 31న మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 4న నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఏపీలో ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చినట్టు అవుతుంది. ఫిబ్రవరి న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9 న రెండోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17 న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఐతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించలేమని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరపాల్పిన అధికారులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంపై దృష్టి పెట్టారని వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సారథ్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమం అతి పెద్ద ప్రక్రియ అని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పాల్గొనే యంత్రాంగమే వ్యాక్సిన్ తీసుకునే వారిలో ముందు వరుసలో ఉన్నారని తెలిపింది. అటు ఉద్యోగ సంఘాలు కూడా.. తాము ఎన్నికల్లో పాల్గొనలేమని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అమ్మ ఒడి పథకం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.