AP GOVT WHIP YSRCP MLA PINNELLI RAMAKRISHNAREDDY BROTHER CAR RAMS INTO SAGAR CANAL HIS WIFE AND DAUGHTER DIED SK
సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి కారు.. ఇద్దరు కుటుంబ సభ్యుల మృతి
కారును బయటకు తీస్తున్న రెస్క్యూ సిబ్బంది
Car rams into sagar right canal: రాత్రి 2 గంటల సమయంలో ఓ భారీ క్రేన్ సాయంతో కారును బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మదన్ మోహన్ రెడ్డి భార్య, కుమార్తె చనిపోయి ఉన్నారు. వారి మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
సంక్రాంతి (Sankranti 2022) పండగ వేళ వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఆయన బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలోకి (Car rams into Sagar canal) దూసుకెళ్లింది. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మదన్ మోహన్ రెడ్డి క్షేమంగా బయటపడగా.. ఆయన భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష చనిపోయారు. అర్ధరాత్రి తర్వాత వీరి మృతదేహాలు బయటపడ్డాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో షాపింగ్ కోసం మదన్ మోహన్ రెడ్డి.. తన భార్యాకుమార్తెతో కలిసి విజయవాడ (Viayawada)కు వెళ్లారు. విజయవాడలో షాపింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో అడిగొప్పల దాటిన తర్వాత వీరి కారు ప్రమాదానికి గురయింది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే ప్రయత్నంలో.. కారు అదుపుతప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మదన్ మోహన్ రెడ్డి విండ్ నుంచి బయటకు వచ్చి.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం పోలీసులు, బంధువులకు సమాచారం ఇచ్చారు.
అప్పటికే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని మదన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆయన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సోదరుడని తెలిసి.. వెంటనే సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులు కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది రాత్రి నుంచి కారు కోసం గాలించారు. ముందుజాగ్రత్తగా బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నీరు దిగువకు వెళ్లకుండా నిలిపివేశారు. కారు కోసం గజఈత గాళ్లు తీవ్రంగా గాలించారు. ఐతే అర్ధరాత్రి దాటిన తర్వాత కారు ఆచూకి తెలిసింది. రాత్రి 2 గంటల సమయంలో ఓ భారీ క్రేన్ సాయంతో కారును బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మదన్ మోహన్ రెడ్డి భార్య, కుమార్తె చనిపోయి ఉన్నారు. వారి మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. తన సోదరుడి భార్య, కుమార్తె మరణించడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు.
ప్రస్తుతం మదన్ మోహర్ రెడ్డి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఐతే భార్యాపిల్లలు మరణించారని తెలిసి ఆయన షాక్లో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భార్య, కూతురు కూడా ముందు సీట్లోనే కూర్చోవడం.. వారితో మాట్లాడుతూ కారును డ్రైవ్ చేయడంతో.. ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్పారు. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే క్రమంలోనే కారు కాలువలోకి దూసుకెళ్లిందని వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో సంక్రాంతి పండగ వేళ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.