news18-telugu
Updated: November 7, 2020, 2:22 PM IST
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ (File)
ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజికవర్గంలో వెనుకబడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాపు నేస్తం పథకం లబ్ధిదారులకు ‘దీపావళి గిఫ్ట్’ ఇచ్చింది. కాపు నేస్తం పథకం కింద అర్హులైనా కూడా కొందరికి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదు. దీంతో వారందరినీ మరోసారి గుర్తించి వారికి కూడా పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినవారికి కూడా కలిపి కాపు నేస్తం పథకం కింద రూ.142.82 కోట్లు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, కాపు కార్పొరేషన్ చైర్మన్ దాడిశెట్టి రాజా ఈ నిధులను విడుదల చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణు అర్హులైన ప్రతి ఒక్కరికీ కాపు నేస్తం నిధులను అందిస్తామని చెప్పినట్టే కొత్త వారికి కూడా నిధులు ఇచ్చామని చెప్పారు. కాపులకు జగనన్న ఇస్తున్న దీపావళి కానుక ఇది అని మంత్రి అన్నారు. బాధల్లో ఉన్న వారిని చూసి చలించే మనస్తత్వం ఉన్న జగన్ పాదయాత్రలో ఎంతో మంది సమస్యలు విని జగన్ వాటన్నింటికి ఇప్పుడు పలు విధాలుగా పరిష్కారాలను చూపిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. కరోనా సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కాపు మహిళల అభ్యున్నతి కోసం ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’పథకానికి శ్రీకారం చుట్టింది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 24న తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కాపు మహిళలకు అండగా నిలిచేందుకు ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో అర్హులైన కాపు ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని చేస్తుంది.
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి అర్హతలు
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించకూడదు.
ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) లోపు భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.
అదే పట్టణ ప్రాంతాల వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు, ఇతర ఏ నిర్మాణాలు ఉండకూడదు.
ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్ కూడా పొందరాదు.ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఉండనుంది.
ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారులై ఉండకూడదు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 7, 2020, 2:22 PM IST