అమరావతి (Amaravati) రాజధానిపై ఏపీలో మళ్లీ రచ్చ జరుగుతోంది. ఓవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మళ్లీ తీసుకొస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అమరావతి రైతు ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకుంటున్న సందర్భంగా ఈ నెల 12న మహాపాదయాత్రను అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ (Amaravati Municipality) ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. రాజధాని పరిధిలోని 22 గ్రామ పంచాయతీలతో అమరావతి పురపాలక సంఘం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ సభ నిర్వహణకు గుంటూరు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.
రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది. అప్పట్లో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని పరిధిలోని మొత్తం 29 పంచాయతీలతో మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ప్రభుత్వ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది. దాదాపు ఏడు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు మున్సిపాలిటీ ప్రతిపాదనను తీసుకొచ్చింది. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతి మున్సిపాలిటీకి ఓకే చెప్పింది. ఐతే సెప్టెంబరు 12న రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. వారు లేని సమయంలో గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారన్న దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐనప్పటికీ 22 గ్రామాలతో మున్సిపాలిటీలని ఒప్పుకునేది లేదని కొందరు స్థానికులు తేల్చి చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP News