ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లకు 35 ఏళ్ల వయసు నిండితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్.నవీన్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడడ్డారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 2.60లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లుగా నియమించింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. వలంటీర్ల సంఖ్య ప్రతి జిల్లాలో 20వేల నుంచి 30వేల మంది వరకు ఉన్నారు. గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారిలో చాలా మంది అధికార పార్టీ అనుచరులు, రికమండేషన్లతో వచ్చిన వారే ఉన్నారు. దాదాపు ఏడాదిన్నరగా వీరంతా ఇంటింటికీ పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలను చేరవేస్తున్నారు. 2021 జనవరి నుంచి రేషన్ సరుకులు కూడా వీరే సరఫరా చేయనున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో నియామకాలు చేపట్టేనాటికి 18 ఏళ్ల లోపు, 35 ఏళ్లు వయసు పైబడిన వారు ఉద్వాసనకు గురయ్యారు. ఇప్పటికే 35 ఏళ్లు నిండి వలంటీరుగా పనిచేస్తున్న వారికి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు రావం లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లు నిండిన వలంటీర్ల నియామకం జరిగిన దృష్ట్యా వారిని విధుల నుంచి తొలగించాలని, ఆ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వలంటీర్లలో ఆందోళన నెలకొంది. సర్కారు నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు. తాజా ఉత్తర్వులతో ఉద్యోగం కోల్పోతున్నవారి సంఖ్య వేలల్లోనే ఉండనుంది.
వలంటీర్ల నియామక సమయంలో చదువు కొనసాగిస్తున్నవారు, ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారిని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఐతే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వలంటీర్ ఉద్యోగాన్ని పార్ట్ టైమ్ జాబ్ గా భావిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల వీరిపై అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులతో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap government, Ap grama sachivalayam, Gram volunteer, Ward Volunteers, Ys jagan