విశాఖపట్నంలోనూ మెట్రో రైలు పరుగులు తీసే రోజుల కోసం విశాఖ వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు దాదాపు రూ.14,309 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. విశాఖ నగరంలో 76.9 కిలోమీటర్ల పరిధిలో 54 స్టాప్ లతో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించనున్నారు. అయితే విశాఖ మెట్రో కోసం వైజాగ్ ప్రజలతో పాటు.. ఉత్తరాంధ్ర వాసులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వేళ... కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.
విశాఖపట్టణంలో మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి బదులిస్తూ విశాఖ మెట్రో రైలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2017లోనే మెట్రోరైలు పాలసీని రూపొందించామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన చేయలేదన్నారు. పీపీపీ విధానంలో లైట్‌రైల్ ప్రాజెక్టును నిర్మించాలని 2018లో అనుకున్నామని, ఇందుకు సంబంధించి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకును కేంద్రం కోరినా, అది నిస్సహాయత వ్యక్తం చేసినట్టు సభకు తెలిపారు.
ఈ విషయాన్ని 2019లోనే ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆ ప్రాజెక్టుకు రుణసాయం కోసం ఇతర సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించినట్టు తెలిపారు. అయితే, ఏపీ ప్రభుత్వం మరే విదేశీ సంస్థకు దరఖాస్తు చేసుకోలేదని మంత్రి వివరించారు.
ఇక విశాఖ నగర భవిష్యత్ జనాభా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు ప్రాజెక్టు ఉంటుందని గతంలో తెలిపారు. త్వరలోనే డీపీఆర్ ను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో మొత్తం 3 కారిడార్లు ఉంటాయన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు, తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ (చిన్న వాల్తేర్) వరకు ఈ మూడు కారిడార్లు విస్తరించి ఉంటాయని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap government, Hyderabad Metro, Hyderabad Metro rail, Local News, Vizag