అక్రమ మద్యం రవాణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు.

news18-telugu
Updated: July 9, 2020, 1:00 PM IST
అక్రమ మద్యం రవాణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్ ఏపీలో దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండే మద్యం దుకాణాలను ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుంది. విడతల వారీగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ వస్తోంది. మద్య నిషేధంలో భాగంగానే మద్యం ధరలను పెంచింది. ఈ క్రమంలో ఏపీలో మద్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమ మద్యం రవాణా జోరుగా సాగుతోంది. దీన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ అమలు చేస్తూనే ఎక్సైజ్‌ చట్టంలో పలు సవరణలు చేశారు. తాజాగా సవరించిన ఎక్సైజ్‌ చట్టం 34 (ఏ) ప్రకారం ఒకే వ్యక్తి పలుమార్లు ఎక్సైజ్‌ నేరాలకు పాల్పడితే ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సాధారణ కేసుల విషయంలోనూ రెండేళ్లకు తగ్గకుండా శిక్షలు పడే విధంగా చట్టాన్ని పటిష్టం చేశారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ స్థానంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, ఏపీలో సారా రూపంలో కల్తీ మద్యం తయారు కాకుండా నిరోధించేందుకు ఎస్‌ఈబీ స్వతంత్ర వ్యవస్థగా పనిచేస్తుంది. దశల వారీ మద్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖను నిర్వీర్యం చేశారని, ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు కలిసి అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎస్‌ఈబీకి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading