Jaganna Thodu: నేడు జగనన్న తోడు పథకం ప్రారంభం.. అర్హులు వీరే.. జిల్లాల వారీగా వివరాలు

Jaganna Thodu: గ్రామాలు, పట్టణాల్లో సుమారు అయిదు అడుగుల పొడవు, అయిదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.

news18-telugu
Updated: November 25, 2020, 5:44 AM IST
Jaganna Thodu: నేడు జగనన్న తోడు పథకం ప్రారంభం.. అర్హులు వీరే.. జిల్లాల వారీగా వివరాలు
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని లక్షల మంది చిరు, వీధి వ్యాపారులు, హాకర్స్‌కు బ్యాంకుల ద్వారా వారికి రూ. 10 వేల వరకు సున్నావడ్డీ రుణాలను అందించే ప్రక్రియకు నాంది పలికారు. నేడు సుమారు రూ.1000 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను చిరు వ్యాపారులకు, సంప్రదాయ వృత్తిదారులకు సీఎం జగన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంను వర్తింప చేసేందుకు దరఖాస్తు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జగనన్నతోడు పథకానికి అర్హులు వీరే..

గ్రామాలు, పట్టణాల్లో సుమారు అయిదు అడుగుల పొడవు, అయిదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ల పైన, పబ్లిక్, ప్రైవేటు స్థలాల్లో తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఆహారపదార్ధాలు, చేనేత, హస్తకళా వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నవారు, నెత్తిమీద గంపలో వస్తువులు మోస్తూ, అమ్ముకునే పేదవారు ఈ పథకం ద్వారా సాయం పొందొచ్చు. సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు.. సంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కళంకారీ కళాకారులు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మల తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామగ్రి తయారీదారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా సాయం పొందాలంటే సదరు వ్యాపారి వయస్సు పద్దెనిమిది ఏళ్లు నిండి వుండాలి. ఆధార్, ఓటర్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి వుండాలి. సంప్రదాయ ముడిపదార్ధాలతో లేస్ వర్క్‌, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, బొబ్బొలి వీణలు, కంచు కళాకృతులు రూపొందించే చేతివృత్తి కళాకారులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా..
గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులను గుర్తించేందుకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నారు. అన్ని అర్హతలు వున్న వ్యక్తులు ఈ జాబితాలో తమ పేరు లేనిపక్షంలో వెంటనే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హులై ఉండి బ్యాంకు ఖాతా లేనివారికి కొత్తగా పొదుపు ఖాతా ప్రారంభించేలా వాలంటీర్ల ద్వారా తోడ్పాటును అందిస్తారు. అర్హులైన వారి దరఖాస్తులను గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్‌ ద్వారా సంబంధిత బ్యాంకులకు పంపుతారు.

బ్యాంకులతో సమన్వయం కోసం ప్రత్యేక పోర్టల్...
బ్యాంకులతో సమన్వయం చేసుకోవడం, పటిష్టంగా ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. బ్యాంకులు తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారుడి అవసరాన్ని బట్టి రూ.పదివేల వరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంకులో లోన్‌ అకౌంట్‌ను తెరిచిన లబ్దిదారుడికి మూడు నుంచి నాలుగు రోజుల్లో రుణం మొత్తాన్ని జమ చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులను అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సెర్ఫ్, మెప్మాలు సమన్వయంతో ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాయి. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణంను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తరువాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రియాంబర్స్‌ చేస్తుంది.

నిరంతరం ఎంపిక ప్రక్రియ
ఇంకా ఎవరైనా పొరపాటున ఈ పథకం కింద అర్హులు మిగిలిపోతే, గ్రామ, వార్డు వాలంటీర్లను సంప్రదించి, గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లోపు సదరు దరఖాస్తును పరిశీలించి వారికి కూడా రుణాలను అందించనున్నారు. అలాగే ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించడం ద్వారా మరింత మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇంకా ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా వారు చేసే వ్యాపారంను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హతను బట్టి రుణాలు అందిస్తారు.జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు చూసుకుంటే.. అనంతపురం జిల్లాలో 66150 మంది, చిత్తూరు 74994, తూర్పు గోదావరి 90979, గుంటూరు 97530, కృష్ణా 53870, గుంటూరు 97530, ప్రకాశం 75416, నెల్లూరు 60867, శ్రీకాకుళం 42238, విశాఖ 87527, విజయనగరం జిల్లాలో 41269 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: November 25, 2020, 5:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading