AP GOVERNMENT TO HIKE LAND VALUES AS PER NEW DISTRICT HEAD QUARTERS FULL DETAILS HERE PRN
AP Land Rates: ఏపీలో కొత్త జిల్లాల ఎఫెక్ట్.. భూముల ధరలకు రెక్కలు.. అదనపు భారం తప్పదా..?
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు (AP New Districts) ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివివజన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రభావం భూముల ధరలపై పడనుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు (AP New Districts) ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివివజన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాలు, 22 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలు కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఇతర కార్యాలయాల రాకతో అభివృద్ధి బాటపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా భూముల మార్కెట్ విలువల్ని సవరించేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.
జిల్లాలకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ అయి కొత్త జిల్లా కేంద్రాలు అమల్లోక వచ్చిన వెంటనే భూముల విలువలు మారిపోనున్నాయి. భూముల విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో మార్కెట్ విలువల్ని సవరిస్తారు. గత ఏడాది కరోనా కారణంగా పెంపును వాయిదా వేశారు.
మార్చి 31 వరకు పెంపు లేదని ప్రకటించిన ప్రభుత్వం.. ఏప్రిల్ నుంచి కొత్త విలువలను అమలు చేయనుంది. నిజానికి ఫిబ్రవరి నుంచే మార్కెట్ విలువలు సవరించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. తొలుత గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో భూముల విలువను పెంచారు. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పెంచేందుకు కసరత్తు చేశారు.
మార్కెట్ విలువ పెంపుని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చేపడతారు. ఆయా ప్రాంతాల్లో ఎంత పెంచాలి..? అక్కడ జరిగిన అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, వ్యాపార అవకాశాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు. మార్కె ట్ విలువలను ప్రతిపాదించిన అనంతరం.. వాటికి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలు తాత్కాలిక అనుమతులివ్వగా.. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్లో ఉంచి అభ్యంతరాలు స్వీకరించారు.
ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం కొన్ని మార్పులు చేసి ఆస్తుల మార్కెట్ విలువలు నిర్ధారించారు. వాటికి జేసీ కమిటీల నుంచి ఆమోదం కూడా లభించింది. కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ చేసుకొని అమలు చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది.
కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చే అవకాశముండటంతో మార్కెట్ విలువ పెంపుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఐతే మార్కెట్ విలువలు పెరిగితే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఈ లెక్కన ఆయా ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలు భూములు కొనుగోలు చేస్తే అదనపు భారం పడే అవకాశముంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.