AP GOVERNMENT TO COLLECT TRUE UP CHARGES FORM COSTUMERS FOR THREE YEARS FULL DETAILS HERE PRN
AP Power Charges: మరో బాదుడికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.. మరో మూడేళ్లు ఛార్జీల మోతే..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలపై మరో భారం పడనుంది. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల వడ్డనకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ( Electricity Charges hike) తో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. దానికి ట్రూఅప్ ఛార్జీలు కలవనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలపై మరో భారం పడనుంది. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల వడ్డనకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ( Electricity Charges hike) తో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. దానికి ట్రూఅప్ ఛార్జీలు కలవనున్నాయి. వినియోగదారుల పరిధిని బట్టి మూడేళ్ల వరకు ఈ ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. తాజాగా ఏపీ ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల భారం మరో రూ.609.16 కోట్లు పెరిగింది. గత ఏడాది రూ.3,368 కోట్లకు అనుమతించిన ఏపీఈఆర్సీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.3,977.16 కోట్లకు పెంచింది. వీటిలో వ్యవసాయ విద్యుత్ పై ప్రభుత్వం ఇచ్చే రూ.1,066.54 కోట్లను తీసేయగా.., మిగిలిన రూ.2,910.62 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీల భారం ఈ ఏడాది ఆగస్టు నుంచి విద్యుత్ ఛార్జీలతో కలిపి వసూలు చేస్తారు.
ఇదిలా ఉంటే 2014-15 నుంచి 2018-19 ఐదేళ్లలో వినియోదించిన విద్యుత్ ఆధారంగా ట్రూ అప్ ఛార్జీలను గత ఏడాది వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే దీనిపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తర్వాతి నెలల బిల్లులతో సర్దుబాటు చేసింది. ఐదేళ్లలో వినియోగించిన విద్యుత్ లెక్కలను డిస్కమ్ ఇప్పటికే తీస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ లో ఎనిమిది నెలల పాటు ట్రూఅప్ ఛార్జీలను 10.5శాతం వడ్డీతో వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ అనుమతిచ్చింది. రెండు నెలల పాటు వసూలు చేసిన ఛార్జీలను ఆ తర్వాత విరమించుకుంది. మళ్లీ ట్రూఅప్ ఛార్జీల వసూలుకు అనుమతివ్వడంతో రాష్ట్రంలోని 1.47 కోట్ల ఇళ్లు, 14.68 లక్షల కమర్షియల్, 1.61 లక్షల ఇండస్ట్రియల్ కనెక్షన్స్ పై భారం పడనుంది.
ఎందుకంత భారం..?
విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో నాణ్యత పెంచడానికి చేపట్టిన చర్యలకు సంబంధించిన ఖర్చులను ట్రూ అఫ్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తారు. 2014-19 వరకు ఐదేళ్లలో ఏపీఎస్పీడీసీఎల్ 2135.60 కోట్లు, సీపీడీసీఎల్ రూ.1232.56, ఈపీడీసీఎల్ రూ.609 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లెక్కన ఎస్పీడీసీఎల్,సీపీడీసీఎల్ పరిధిలో ఉన్న వినియోగదారులు 36 నెలలు, ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నవారు 18 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇటీవల విద్యుత్ ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఆరు శ్లాబుల్లో వినియోగదారులను విభజించిన ప్రభుత్వం.. యూనిట్ పై 40 పైసల నుంచి రూ.1.57 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన 200 యూనిట్లు వినియోగించే వారిపై ఎక్కువ భారం పడనుంది. ప్రభుత్వం మాత్రం పెంచక తప్పలేదని చెబుతుండగా... ప్రతిపక్షాలు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. పెంచిన ఛార్జీలకు ట్రూ అప్ ఛార్జీలు కూడా కలుస్తుండటంతో సామాన్యులకు కరెంట్ షాక్ తప్పడం లేదు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.