ఏపీలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సుధాకర్ అరెస్ట్ వ్యవహారం దర్యాప్తు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు వేశామని హైకోర్టులో ప్రభుత్వం వాదనలు వినిపించింది.
నాలుగు రోజుల క్రితం డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ వ్యవహారంపై 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సుధాకర్ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ప్రస్తావన లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదన్న హైకోర్టు... దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి తమకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని... అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.