టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజుకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇటీవల దుండగుల దాడితో ధ్వంసమైన రామతీర్థం శ్రీరాముడి విగ్రహం పునర్ నిర్మాణానికి రూ. లక్ష చెక్కును అశోక్ గజపతిరాజు దేవాదాయశాఖకు పంపించారు. అయితే ఆయన పంపించిన చెక్కును ఏపీ దేవాదాయశాఖ ఆయనకు తిరిగి పంపించింది. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం తయారు చేసే బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందని రాష్ట్ర దేవాదాయశాఖ అశోక్ గజపతిరాజుకు తెలిపింది. కాబట్టి ఆయన పంపిన చెక్కును తిరిగి పంపింది. ఈ మేరకు ఆయన పంపిన చెక్కుతో పాటు ఓ లేఖను పంపింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో రామతీర్థం రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై చర్యలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఈ క్రమంలో ఆ ఆలయానికి చైర్మన్గా ఉన్న టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తప్పించింది. రామతీర్థం ఆలయ చైర్మన్ పదవితోపాటు మరో రెండు ఆలయాల చైర్మన్ పదవుల నుంచి ఆయన్ను తప్పించింది. పైడితల్లి అమ్మవారి ఆలయం, మండపల్లి ఆలయాల బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ చైర్మన్గా ఉంటూ కూడా ఆలయాలను సంరక్షించలేకపోయారంటూ ఆయన్ను తప్పిస్తూ దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఆలయాలను రక్షించలేక అకారణంగా తమపై చర్యలు తీసుకుందని అశోక్ గజపతిరాజు వర్గం ఆరోపించింది.
మరోవైపు రామతీర్థం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో.. ఈ ఘటనపై సీఐడీ విచారణకు జగన్ సర్కార్ ఆదేశించింది. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐడీ చీఫ్.. ఇది ఆకతాయిల పని కాదని.. ఎవరో కావాలనే ఇలా చేశారని అన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో పలు ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అందులో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వెల్లడించారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లు డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. ఏపీలో మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఆలయాలపై దాడుల్ని రాజకీయం చేయొద్దని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేవారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో భద్రత పెంచుతున్నామని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:January 16, 2021, 15:57 IST