నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందించేందుకు దాదాపు ఏడు దశాబ్దాలుగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీలు (Employment Exchange) కొనసాగుతున్నాయి. అప్పటినుంచి నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీలో సమాచారాన్ని అందిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) వీటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల స్థానంలో నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేజీల స్థానంలో మోడల్ కెరీర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ శాఖ అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఇప్పటికీ దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 జనవరిలోనే వీటిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం జిల్లాల్లో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధిం కసరత్తు జరుగుతోంది. వీటి కోసం అధునాత సౌకర్యాలున్న భవనాల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు రైట్ జాబ్.. రైట్ ఫ్యూచర్ అనే లక్ష్యంతో ఈ మోడల్ కెరీర్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగాలు రావడంతో పాటు ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంతో పాటు మెరుగైన శిక్షణ కూడా అందనుంది. విద్యార్థులు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం ఏ సంస్థలో ఉంది..? ఏ ప్రాంతంలో ఉంది..? వారు ఎలాంటి ఉద్యోగాలకు అర్హులు అనేది కూడా ఎంసీసీలోని ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తారు.
ప్రస్తుతం ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల్లో 170 నుంచి 200 మంది ఉద్యోగుల వరకు ఉన్నారు. ఒక్కో చోట 12 నుంచి 15 మంది ఉద్యోగులున్నారు. మోడల్ కెరీర్ సెంటర్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 20 నుంచి 25కు పెరగనుంది. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి.. మోడల్ కెరీర్ సెంటర్ మేనేజర్ గా వ్యవహరిస్తారు. అలాగే ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు రిసెప్షనిస్టులు, టెక్నికల్ సిబ్బంది ఉంటారు. అలాగే విద్యార్థులకు ఐటీ ల్యాబ్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐటీ ల్యాబ్స్ లో స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ సమాచారాన్ని భద్రపరుస్తారు.
ప్రస్తుతం జిల్లా స్థాయిలో మోడల్ కెరీర్ సెంటర్లకు అవసరమైన భవనాల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ భవనాల్లోనే యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు జాబ్ మేళాలు నిర్వహించేందుకు అనువుగా ఉండేలా ఎంపిక చేస్తున్నారు. అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా సిద్ధం చేస్తున్నారు. మోడల్ కెరీర్ సెంటర్లు అందుబాటులోకి వస్తే లక్షలాది మంది విద్యార్థులకు వారి చదువుకు తగ్గట్లే మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Ap government, EMPLOYMENT, JOBS