ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సర్కార్ ఝలక్ ఇచ్చింది. సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వారం రోజుల పాటు డెడ్ లైన్ విధించింది. అలాగే ఉద్యోగుల సంఘం గవర్నర్ కు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆర్ధిక అంశాలపై సంప్రదించే మార్గం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాలున్న గవర్నర్ ను ఎందుకు కలిశారని ప్రభుత్వం ప్రశ్నించింది.
ఇక తమకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యోగ సంఘాల నేతలు తమ గోడును గవర్నర్ కు విన్నవించుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అంటూ గవర్నర్ బిశ్వభూషన్ కు కలిసారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను పేరుకుపోయిన జీపీఎఫ్, మెడికల్ క్లయిమ్స్, డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు వాపోయారు. వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలని గవర్నర్ ను కోరారు.
గవర్నర్ తో భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ..ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాలను నుండి అనుమతి లేకుండా డబ్బు విత్ డ్రా చేస్తుందని ఆయన ఆరోపించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో 95 శాతం మందికి 5వ తారీఖు లోపే జీతాలు వేస్తున్నామని పేర్కొంది. అయితే ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల్లో వారం రోజులు గడువు ఇవ్వగా..ఏపీ ఉద్యోగ సంఘాలు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నోటీసులతో రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఉద్యోగుల మద్య వార్ పీక్స్ కు చేరినట్లు తెలుస్తుంది. మరి ప్రభుత్వం గడువు ఇచ్చిన ఈ 7 రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News