ఏపీలో కొత్త ఇసుక విధానం... ఇకపై ఇసుకను ఇలా కొనుక్కోవాలి...

ఇసుక కొనుక్కోవడం ఎలా?

AP New Sand Policy : పారదర్శక పాలనలో భాగంగా... ఏపీ ప్రభుత్వం ఇసుక కొనుగోళ్లను ఆన్‌లైన్ చేసింది. ఎవరైనా సరే... ఇసుకను ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కొనుక్కోగలరు.

  • Share this:
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటూ... అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... ఆ దిశగా అడుగులు వేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడిందంటున్న వైసీపీ సర్కార్... కొత్త ఇసుక విధానాన్ని తెచ్చింది. దాని ప్రకారం ఎవరైనా సరే... ఇసుకను ఆన్‌లైన్‌లో కొనుక్కోవాల్సిందే. అందుకోసం ప్రభుత్వం సరికొత్త వెబ్‌సైట్ తెరిచింది. అందులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి ఇసుకను కొనుక్కునే ఛాన్స్ లభిస్తుంది. ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా, ఎక్కడైనా సరే... ఎవరికి ఇసుక కావాలన్నా... ముందుగా ఆ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. అదేమంత కష్టమైన పని కాదు. చాలా తేలికే. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఇసుక కొనుక్కోవడం ఎలా?


ఇలా చెయ్యండి :
- http://sand.ap.gov.in/index.htm?aspxerrorpath=/ ఈ లింక్ క్లిక్ చెయ్యాల్సి ఉంటుంది.
- వెంటనే మీకు... ఏపీ శాండ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- పోర్టల్‌లో జనరల్ కస్టమర్, బల్క్ కస్టమర్ అనే రెండు ఆప్షన్స్ వేర్వేరుగా ఉంటాయి.

మీరు ఏ కస్టమర్?


- ఇసుక వ్యక్తిగతంగా ఇళ్ల కోసం అయితే జనరల్ కస్టమర్ కేటగిరిలో రిజిస్టేషన్ చేసుకోవాలి.
- భారీ భవనాలకు, అపార్ట్‌మెంట్లకు, ఎక్కువ మొత్తంలో ఇళ్ల సముదాయానికి అయితే బల్క్ కస్టమర్ కేటగిరీలోకి వెళ్లి నమోదు చేసుకోవాలి.
- ఏ కస్టమర్ ఎలా నమోదు చేసుకోవాలో రిజిస్ట్రేషన్ విధానం కూడా డాక్యుమెంట్ రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రొసీజర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని ప్రకారం రిజిస్టేషన్ పూర్తి చేయాలి.
- కస్టమర్ నమోదు కోసం మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్ తదితర వివరాలు ఇవ్వాలి. ఆధార్ సంఖ్య నమోదు చేయగానే మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి రిజిస్టేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్‌గా నమోదు చేసుకున్న తర్వాత ఇసుక ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇసుక ఆర్డర్ చేసుకోవడం కోసం మరో డాక్యుమెంట్ అందుబాటులో ఉంచారు. దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని ప్రకారం ఇసుక ఎంత పరిమాణంలో కావాలి, ఎప్పుడు కావాలి, అందుబాటులో ఉన్న స్లాట్లు, ఇసుక కొనుగోలుకు ఎంత ఖర్చవుతుంది? రవాణా ఛార్జీలు ఎంత చెల్లించాలి? అనే వివరాలు ఇందులో పొందుపరిచారు.
- ఇసుకను బుక్ చేసుకున్న తర్వాత... ఇచ్చిన ఆర్డర్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా సైట్‌లో ఉంది.
- మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆన్‌లైన్ ఇసుక విధానాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో అధికారికంగా ఇసుక కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.
- ఇంకెందుకాలస్యం... ఇసుక కొనుక్కోవాలనుకునేవారు... వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రొసీజర్ ఫాలో అవ్వండి.

ఆన్‌లైన్ ఎందుకు? : ఇలా ఆన్‌లైన్‌లో ఇసుక కొనుక్కోవడం వల్ల ప్రభుత్వానికి చాలా ప్రయోజనాలుంటాయి.
- మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి ఛాన్స్ లేకుండా జరుగుతుంది.
- ఇసుకకు సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంటాయి.
- రాష్ట్రవ్యాప్తంగా ఎంత ఇసుక అమ్ముడవుతోందీ, ఇంకా ఎంత ఉందీ అన్నీ తెలుస్తాయి.
- ఎవరు ఎంత ఇసుక కొన్నారు, ఏ రేటుకి కొన్నారు అనే విషయాలు ఈజీగా తెలుస్తాయి.
- ప్రతిపక్షాల్ని కట్టడి చేసేందుకూ, పారదర్శక పాలన అందించేందుకూ ఈ వెబ్‌సైట్ చక్కగా ఉపయోగపడుతుంది.

(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)
First published: