ఏపీవాసులకు గుడ్ న్యూస్.. కరోనా కోసం కీలక అప్లికేషన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్’ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ పట్ల ఏపీ ప్రభుత్వం మొదట్నుంచీ పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాజిటివ్ కేసులు సైతం భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?, ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలన్ని సందేహాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే వీటన్నింటినీ నివృత్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్’ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  ఈ అప్లికేషన్ ద్వారా కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ప్రజలకు అవసరమైన సమస్త సమాచారం ఈ మొబైల్‌ ఆప్లికేషన్‌లో అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని కోవిడ్-19 ఆస్పత్రుల వివరాలు, క్వారంటైన్ కేంద్రాల సమాచారం, కోవిడ్ పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని కరోనా పాజిటివ్ కేసులు, డిశ్ఛార్జ్ అయిన వారు, మరణాల సంఖ్యతోపాటు ప్రతి రోజు ప్రభుత్వం విడుదల చేసే మీడియా బులిటెన్ సైతం ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనలో ఉన్న లక్షణాలను బట్టి కోవిడ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో ఉండే వార్డు వాలంటీర్, ఎఎన్ఎం, డాక్టర్‌ను సంప్రదించడం తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

  స్మార్ట్‌ఫోన్ యూజర్లు https://bit.ly/30FvmBm లింక్ నుంచి ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. దీంతో పాటు కోవిడ్-19కి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా, ఇతర సహాయం కోసమైనా జాతీయస్థాయి హెల్ప్ లైన్ 1075, రాష్ట్రస్థాయిలో 104కి కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వైఎస్సార్ టెలీమెడిసిన్ నెంబర్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్‌తో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలను తెలపవచ్చని సూచించారు. ఇంకా కోవిడ్-19 కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం 8297104104 వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ చేసి.. లేదా 8297104104 నెంబర్‌కు డయల్ చేసి ఐవిఆర్ఎస్(IVRS) ద్వారా సహాయం పొందవచ్చని వివరించారు.
  Published by:Narsimha Badhini
  First published: