ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సోమవారం నుంచి కొత్త జిల్లాలు (AP New Districts) అవతరించనున్నాయి. ఇప్పటికే ముహూర్తం ఖరారు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.05 – 9.45 నిముషాల మధ్య సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. 13 జిల్లాల రాష్ట్రం నేటి నుంచి 26 జిల్లాల రాష్ట్రంగా మారనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మూడు రాజధానుల మాదిరిగానే పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని స్పష్టం చేసింది.
అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని.., పాలన సామాన్య ప్రజలకు, బడుగు, బలహీనవర్గాలకు చేరువగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. . అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా, ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో మ్యానిఫెస్టోలో చేసిన వాగ్ధానాన్ని నెరవేరుస్తూ, రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ సీఎం జగన్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని తెలిపింది.
నిన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణలో తొలి అడుగు వేసిన ప్రభుత్వం.., నేడు... కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఈ దిశగా మరో అడుగు ముందుకేసిందని.., రేపు... ఇదే స్పూర్తితో 3 ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు వేస్తుందని పరోక్షంగా మూడు రాజధానుల అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రస్తావించింది.
ప్రజలకు మరింత చేరువగా పాలన
చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుండి మారుమూల, సరిహద్దు గ్రామాలకు సైతం దూరాభారం తగ్గుతుందని.., పరిపాలనా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుందని ప్రభుత్వం పేర్కొంది.
పథకాల అమలులో మరింత వేగం
పాలనా పరంగా పెరగనున్న పర్యవేక్షణ పెరగడంతో అభివృద్దికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుందని., ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్ధాయిలో మరింత వేగంగా, మరింత పారదర్శకంగా అమలుచేసే అవకాశముందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్ధిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసం, పరిపాలనా ప్రధాన కార్యాలయాల సామీప్యత, సుస్ధిర ప్రగతికి దోహదం చేస్తాని తెలిపింది.
జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత
ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండేలా కొత్త జిల్లాలు. ప్రతి జిల్లాలో సగటున 6 లేదా 7 లేదా 8 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయని.., అలాగే 18 నుండి 23 లక్షల మంది జనాభా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఇక గిరిజన సోదరుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేసినట్లు వివరించింది.
ప్రజా సౌకర్యం – పరిపాలనా సౌలభ్యం
ప్రజా సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 లేదా మూడు, లేదా నాలుగు రెవెన్యూ డివిజన్‌లు ఉండేలా కొత్తగా 23 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఎర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాట్లు చేసినట్లు వివరిచింది.
అన్ని కార్యాలయాలు ఒకే చోట
వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయప్రయాసలకోర్చి మైళ్ళ కొద్ది తిరిగే దుస్ధితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారి కార్యాలయాలు, వారి క్యాంప్ కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా కనీసం 15 ఎకరాల సువిశాల స్ధలంలో మంచి డిజైన్లతో పది కాలాల పాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు సర్కార్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.