ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గత నెలలో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో రిపీల్ బిల్లు ప్రవేశపెట్టింది. త్వరలోనే పాలనా వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా రూపొందించి మరోసారి సభ ముందుకు తీసుకొస్తామని అప్పట్లో సీఎం జగన్ (CM YS Jagan) ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి (Capital Amaravathi)లో నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేస్తారా..? లేదా..? అనేది చర్చనీయాంశమైంది. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్నప్పటికీ రైతుల పిటిషన్లపై విచారణ జరుగుతూనే ఉంది. గత విచారణ సందర్భంగా రాజధానుల ఉపసంహరణ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందలేదు. దీంతో తదుపరి విచారణ సమయానికి పూర్తి సమాచారంతో రావాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
గవర్నర్ ఆమోదంతో బిల్లులకు చట్టబద్ధత వచ్చినట్లు గత నెల 13న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను అఫిడవిట్ తో పాటు కోర్టుకు సమర్పించింది. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపీల్ బిల్లులను కూడా జత చేసింది. ఈనెల 27న రాజధానిపై కోర్టలో విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది.
పెడింగ్ నిర్మాణాలపై స్పష్టత..
రాజధాని అమరావతిలో పెండింగ్ నిర్మాణలపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టతనిచ్చింది. రాజధానిలో నిర్మాణాల పూర్తికి గతంలో అంచనా వేసిన ప్రకారం ఇంకా రూ.13,058384 కోట్లు చెల్లించాల్సి ఉందని.. తాజాగా దానిని రూ.4.377.35 కోట్లకు కుదించింది. అలాగే రూ.16,223.14 కోట్లతో ఎల్పీఎఫ్ లేఅవుట్ల అభివృద్ధికి వెచ్చించాల్సి ఉండగా.. దానిని రూ.6,715.53 కోట్లకు కుదించి పనులకు సీఎం అంగీకారం తెలిపినట్లు అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10వేల కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. అలాగే కృష్ణా నది కరకట్ట రోడ్డును కొండవీటి వాగు ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నుంచి రాజధానిలోని ఎస్13 రోడ్డు వరకు బలోపేతం చేసేందుకు రూ.150 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వీటితో పాటు హైకోర్టుకు అదనపు భవనాల నిర్మాణానికి రూ.33.5 కోట్లతో పనులు ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇదిలా ఉంటే ఏపీలో మూడు రాజధానుల నిర్మాణానికి వ్యతిరేకంగా రాజధాని రైతులు కోర్టుకు వెళ్లడంతో రెండు నెలల క్రితం హైకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో నవంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఐతే తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని.. త్వరలోనే కొత్త బిల్లుతో ముందుకు వచ్చి అనుకున్న పనిని పూర్తి చేస్తామని సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, AP High Court