విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన కారణంగా స్థానికుల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనకు సంబంధించిన బాధితులను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ గ్యాస్ దుర్ఘటన ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. మరో 48 గంటలు దాటితే విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు. చుట్టుపక్కల 5 గ్రామాల బాధితులను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే చేపట్టబోతున్నారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు.
ప్రమాదం జరిగిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు విశాఖ ఘటనపై రాజకీయాలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దని విపక్ష పార్టీలకు మంత్రి కన్నబాబు కోరారు. పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గిందని మంత్రి తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రభావిత గ్రామాల ప్రజలను తమ ఇళ్లకు వెళ్లొద్దని చెప్పామన్నారు. ఘటనను పరిశీలించేందుకు కేంద్ర కమిటీ విశాఖకు చేరుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీని నియమించిందన్నారు.
అదేవిధంగా నాగపూర్ నుంచి ఒక బృందం వచ్చిందన్నారు. పర్యావరణంపై అధ్యయంన చేస్తుందని చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆదివారం నుంచే ఈ కమిటీ తన పని మొదలు పెడుతుందన్నారు. విశాఖ ఘటనలో ఇప్పటి వరకు 588 మంది అడ్మిట్ అయ్యారని మంత్రి వెల్లడించారు. 111 మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖలో ఉన్న అన్ని కెమికల్ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.