ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ (PRC Issue)పై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. జీతాలు పెరగకపోగా తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అంతేకాదు పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్సీ అంశం సీఎం జగన్ (CM YS Jagan) తన హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే పీఆర్సీ వివాదం మొదలైనప్పటి నుంచి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా ఇప్పుడు స్వరం మార్చారు.
గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చిస్తోందని.., ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవని వెంకట్రామి రెడ్డి అన్నారు. ఆఫీసర్స్ కమిటీని మొదటి నుంచి వ్యతిరేకించమన్న ఆయన.. ఫిట్ మెంట్ తక్కువైనా.. మిగిలిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో అంగీకరించామన్నారు. హెచ్చార్ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలని గతంలో సీఎంకు చెప్పామని.. హెచ్ఆర్ఏని తగ్గించడాన్ని.. ఇతర అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారన్నారు.
కొన్ని అంశాల్లో రాజీ పడడానికి సిద్దమేనన్న వెంకట్రామిరెడ్డి.. కానీ ప్రతి అంశంలోనూ రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదని కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మిగిలిన సంఘాలతో కూడా కలిసి చర్చించుకుని ఉమ్మడి వేదిక మీదకు వచ్చి పోరాడేందుకు సిద్దమని ప్రకటించారు. అంతేకాదు మిగతా సంఘాలకు ఏమైనా ఇగోలుంటే మేమే ముందుకు వచ్చి మాట్లాడ్డానికి సిద్ధమని రేపు లేదా ఎల్లుండి నుంచి ఉద్యమించేందుకు సన్నద్దంగా ఉన్నామని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.
ఇదిలా ఉంటే పీఆర్సీపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాల ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పీఆర్సీపై జీవోలను ఎలా విడుదల చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. హెచ్ఆర్ఏ తగ్గింపుతో ప్రతి ఉద్యోగికీ నష్టం తప్పడం లేదన్నారు. పదేళ్లకు పీఆర్సీ అంటే ఒప్పుకునేది లేదని.. ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రకటించాల్సిందే అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. హెచ్ఆర్ఏ రేట్లను తగ్గించడం వల్ల ఉద్యోగుల జీతాలు తగ్గుతాయని.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారని తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటలకు మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి పీఆర్సీపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను దగ్ధం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపు ఇచ్చాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Employees