ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (YS Viveka Murder Case) సంచలనం సృష్టించింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది. ఐతే ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఛార్జి షీట్లపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై మండిపడుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారని సజ్జలన అన్నారు. అవినాష్ రెడ్డి పాత్ర వివేక హత్యలో ఉందంటూ బాబు మాట్లాడటం విచిత్రంగా ఉందని అభిప్రాయపడ్డారు.
హత్యా రాజకీయాలు.. వేధింపు రాజకీయాలు సీఎం జగన్ వైఖరి కాదని.., ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే అసలు రాజకీయమని సజ్జల అన్నారు. ఓ వర్గం మీడియాలో అసత్యప్రచారం చేయించి విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య వైసీపీని షేక్ చేసిందని.. ఎన్నికలకు నెలరోజుల ముందు తమకు తగిలిన సడన్ షాక్ అని సజ్జల అభివర్ణించారు. ఆ సమయంలో మాకు షాక్ ఇవ్వాల్సిన అవసరం టీడీపీకే ఉంటుందని ఆయన అన్నారు. సొంత మామ మరణానికి కారణమైన చంద్రబాబు లాంటి వ్యక్తికే ఇలాంటి ఆలోచనలు వస్తాయని సజ్జల విమర్శించారు. హత్య ఎవరు చేశారనేది అక్కడ ఎవరిని అడిగినా తెలుస్తుందన్నారు. వివేకా మృతి విషయంతెలిసి అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళారని.., వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి సమాచారం ఇస్తేనే వెళ్లారన్నారు.
అవినాష్ రెడ్డి వెళ్లడానికంటే ముందే అక్కడికి చాలా మంది వెళ్లారని.. అవినాష్ వెళ్ళగానే సిఐ శంకరయ్యకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని సజ్జల వెల్లడించారు. వీటన్నింటిపై సీబీఐ విచైరణ జరిపిందా..? ఇలాంటివి చెయ్యకుండా సీబీఐ ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డి చెప్పిన మాటలు సీబీఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
జరిగిన ఘటనలన్నీ పరిగణలోకి తీసుకొని ఉంటే ఇలాంటి ఛార్జ్ షీట్ వచ్చేదా అని ప్రశినంచారు. వాస్తవాలను ఎలా పక్కకు నెట్టారనే మా ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పాలన్నారు. అక్కడ దొరికిన లెటర్ ఉదయం నుండి సాయంత్రం వరకూ పోలీసుల దగ్గరకి ఎందుకు రాలేదని.. ఆ విషయాన్ని ఛార్జ్ షీట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
సీబీఐ అడ్డగోలుగా ఛార్జ్ షీట్ వేస్తే.. చంద్రబాబు దానికి ఇంకాస్త యాడ్ చేసి చెప్తున్నారని.., అవినాష్ విజయం కోసం అందరికంటే ఎక్కువ వివేకానే పనిచేశారని సజ్జల గుర్తుచేశారు. గుండెపోటుతో చనిపోయారని ఆదినారాయణ రెడ్డి కూడా చెప్పారని ఆయన అన్నారు. అలాగే సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టిన అంశాలు పచ్చి అపార్ధాలని.., కావాలని వండివార్చినవని ఆరోపించారు.
యంగ్ లీడర్ గా అవినాష్ ఎదుగుదల చూసి చంద్రబాబుకి కుళ్ళబోతు తనంతో అసత్య ప్రచారం చేస్తున్నారని.. గతంలో జగన్ పైనా ఇలాంటి కుళ్ళబోతు తనంతో సీబీఐ కేసు పెట్టారని సజ్జల మండిపడ్డారు. హత్యా, హింసా రాజకీయాలకు సీఎం జగన్ పూర్తి వ్యతిరేకంగా ఉంటారని., అపార్ధానికి బట్టలు వేస్తే చంద్రబాబులా ఉంటుందని ఎద్దేవా చేశారు. సీబీఐపై తాము ఆరోపణలు చెయ్యడం లేదని కేవలం ప్రశ్నిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Sajjala ramakrishna reddy, Ys viveka murder case