ఏపీపై జలఖడ్గం విరుచుకుపడింది. ఊహకందని విధ్వంసం సృష్టించింది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో అల్లకల్లోలం నెలకొంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. వాగులు వంకలు ఉప్పొంగడంతో వరద నీరంతా గ్రామాలను చుట్టుముట్టింది. ఊహించని వరవ విలయంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. బాహుదా (చెయ్యేరు) నది ఉప్పొంగడంతో చుట్టు పక్కల ప్రాంతాలు నీట మనిగాయి. చాలా మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. రాజంపేట, రాజంపేట, నందలూరు గ్రామాల్లో 30 మంది గల్లంతయ్యారు. వీరిలో 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయరామరాజు శుక్రవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో 12 మంది గల్లంతయ్యారని, 8 మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారికంగా తెలిపారు. ఐతే ఏపీ వ్యాప్తంగా 30 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది.
ఎంత మంది కొట్టుకుపోయారు? ఎంత మంది మరణించారన్న దానికి సంబంధించి ఖచ్చితమైన లెక్కలు తేలాల్సి ఉంది. పలు చోట్ల ఆర్టీసీ బస్సులు కూడా కొట్టుకుపోయాయి. గుండ్లూరు శివాలయం ప్రాంతంలో ఏడు, మందపల్లిలో రెండు, నందలూరు ప్రాంతంలో ఒక బస్సు వరదలో చిక్కుకున్నాయి. ఈ ఘటనల్లో ఆర్టీసీ కండక్టరు సహా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
పింఛ, అన్నమయ్య జలాశయాలు పూర్తిగా నిండి, కట్టలు తెగిపోవడంతో వరద ఉద్ధృతి పెరిగింది. చెయ్యేరు నది మహోగ్రరూపం దాల్చింది. అందుకే ఇంతటి ప్రాణనష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మొదట పింఛ కట్ట తెగిపోయి, ఆ నీరంతా అన్నమయ్య జలాశయానికి చేరింది. ఆ తర్వాత అన్నమయ్య డ్యామ్ కట్ట కూడా తెగిపోవడంతో... చెయ్యేరు నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. చుట్టు పక్కల గ్రామాలను ముంచెత్తింది. ప్రస్తుతం కడప జిల్లాల్లో చెయ్యేరు, అనంతపురం జిల్లాలో చిత్రావతి, కుషావతి, సువర్ణముఖి నదులు, నెల్లూరు జిల్లాలో పెన్నా నదులు మహోగ్రరూపం దాల్చాయి.
ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో పెన్నా, కుందూ పరివాహక ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు పొంచి ఉంది. చుట్టు పక్కల గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. లోతట్టు ప్రాంతాల వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం రాత్రి పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలను బస్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. పెన్నా నది ఉప్పొంగుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఎగువ నుంచి ఇంకా వరద వస్తుండడంతో నదుల్లో ప్రవాహం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా చాలా గ్రామాలు వరద ముంపుకు గురయ్యే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.