AP EX SEC NIMMAGADDA RAMESH KUMAR FILES REPLY PETITION IN HIGH COURT AK
ఆ అవసరం లేదు... హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిప్లై పిటిషన్
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు
ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని రిప్లై పిటిషన్లో పేర్కొన్నారు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
ఏపీ ఎస్ఈసీగా తనను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్... తాజాగా ఈ కేసుకు సంబంధించి రిప్లై పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్ విషయాలపై అంశాలవారీగా పిటిషన్ వేసిన ఆయన... రెండు కౌంటర్లు దాఖలు చేశారు. 17 పేజీలతో ప్రభుత్వ అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ ఫిబ్రవరి 20న ఏకపక్షంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. రిజెక్ట్ చేసిన నామినేషన్లపై అభ్యర్థులు అప్పీల్‌కు వెళ్లలేకపోయారని అన్నారు.
ఈసీ పదవీకాలం తగ్గించినా... ఆ మార్పు పదవిలో ఉన్న వ్యక్తికి వర్తించదని అన్నారు. సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలన్నీ అధికారపక్షానికి అనుకూలంగా ఉన్నాయి. కడపలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని... ఎన్నికలు సజావుగా సాగలేదనడానికి ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలే నిదర్శనమని పిటిషన్లో ప్రస్తావించారు. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజు వారీ పనుల్లో సాయం చేయటానికి మాత్రమే పరిమితమని వివరించారు. ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యతగా తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు. ఎన్నికల సంఘంలోని న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాతే తాను దీనిపై సంతకం చేశానని పిటిషన్లో తెలిపారు. ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం ఒకరోజు ముందుగానే నిర్ణయించిందని వివరించారు. ఎన్నికల కమిషనర్‌కి తన విచక్షణ అధికరంతో వాయిదా వేసే అధికారం ఉంటుందని అన్నారు. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదని రిప్లై పిటిషన్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.