అమరావతి రాజధాని రైతులకు (Amaravati Farmers) ఏపీ పోలీసులు షాకిచ్చారు. రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ (AP DGP Rajendranath) గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులను అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు పంపించారు. అమరావతి పరిరక్షణ సమితి (Amaravati Parirakshana Samithi) ఈ నెల 12న చేపట్టనున్న మహాపాదయాత్రను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అమరావతి (Amaravati) లోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై రెండో దఫా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర నిర్వహించ తలపెట్టారు. ఇందుకోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.
పాదయాత్రలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని.. ఇంత మందికి భద్రత కల్పించడం కష్టమని డీజీపీ వెల్లడించారు. ఈ పాదయాత్రతో శాంత్రిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని అన్నారు. కోనసీమ జిల్లాలో ఇటీవల జిల్లా పేరు విషయమై రెండు వర్గాలు ర్యాలీ చేయడం వల్ల హింస చెలరేగి.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను కూడా తగులబెట్టారని డీజీపీ గుర్తు చేశారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలో రెండు రాజకీయ పార్టీల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని.. మీరు తలపెట్టిన పాదయాత్ర కూడా ఆ జిల్లా మీదుగా కూడా వెళ్తుందని.. ఏదైనా గొడవ జరిగితే.. అది పెద్ద సమస్యగా మారే అవకాశముందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని డీజీపీ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Amaravati, Andhra Pradesh, AP News