రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దీనికి సంబంధించి తగిన ఆధారాలతో తన కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరుతూ చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో చంద్రబాబు ఆరోపించడం తెలిసిందే. ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను వైసీపీ నేతలు ప్రైవేటు వ్యక్తులతో ట్యాపింగ్ చేయిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ లేఖలో చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాని...చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కూటా చంద్రబాబు పంపారు. అటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం ఏపీ ఇంటెలిజన్స్ తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించడం రాష్ట్రంలో రాజకీయ కలకలం సృష్టించింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోపణలపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్... రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు మీరు ప్రధాని మోదీకి లేఖ రాసిన అంశం తనకు మీడియా ద్వారా తెలిసినట్లు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. ఎవరైనా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే అది తీవ్రమైన నేరంగా పేర్కొన్న డీజీపీ...దీనికి సంబంధించి మీరు ఆధారాలు సమర్పిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
రాజ్యాంగం పౌరులకు కల్పిస్తున్న ప్రైవసీ హక్కును సంరక్షించేందుకు ఏపీ పోలీసులు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణలో తమకు సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబుకు రాసిన ఆ లేఖలో కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Gautam Sawang