news18-telugu
Updated: April 18, 2020, 7:12 PM IST
పోలీసులకు కూల్ డ్రింక్స్ అందించి పెద్దమనసు చాటుకున్న మహిళకు ఏపీ డీజీపీ సెల్యూట్
నెలకు రూ.3500 జీతానికి పనిచేసే ఓ మహిళ చూపిన మానవత్వానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కరిగిపోయారు. లాక్ డౌన్ సమయంలో మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ మహిళ తనకు తోచిన సాయం చేయాలని భావించి రెండు పెద్ద కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకొచ్చి అందించింది. ఆమె చూపిన మాతృత్వాన్ని, మానవత్వాన్ని చూసి పోలీసులు ఫిదా అయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ మాతృమూర్తితో మాట్లాడారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఆ మహిళతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా సమయంలో పోలీసులు మీద ఆమె చూపిన అభిమానం, ఔదార్యాన్ని చూసి చలించిపోయారు. ‘నమస్కారం అమ్మా. మీరు చూపిన ప్రేమను చూసి చలించిపోయాం. మీ అమ్మ ప్రేమను చూసి చలించాం. పోలీసుల మీద మీరు చూపిన ప్రేమకు సెల్యూట్.’ అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. డీజీపీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న పోలీసు అధికారులు అందరూ ఆమెకు చప్పట్లతో అభినందనలు తెలిపారు. పేదలకు సాయం చేయాలన్న మరో మంచి మనసుతో ఆమె మనవరాలు కూడా కొన్ని మాస్క్లు కుట్టింది. వాటిని కూడా తాము పోలీసులు, అవసరంలో ఉన్నవారికి అందిస్తామని తెలిపింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
April 18, 2020, 6:57 PM IST