AP CRDA WRITES FARMERS TO REGISTER PLOTS BEFORE MARCH 31ST AS PER HIGH COURT VERDICT FULL DETAILS HERE PRN
AP Capital: హైకోర్టు తీర్పు ఎఫెక్ట్.. అమరావతిపై రంగంలోకి సీఆర్డీఏ.. రైతులకు లేఖలు
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధానిగా అమరావతి (Capital Amaravati) ని నిర్మించాలని హైకోర్టు (AP High Court) ఇటీవలే తీర్పునిచ్చిన నేపత్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధానిగా అమరావతి (Capital Amaravati) ని నిర్మించాలని హైకోర్టు (AP High Court) ఇటీవలే తీర్పునిచ్చిన నేపత్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రైతులకు వారి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీఆర్డీఏ రంగంలోకి దిగింది. రాజధానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులు తిరిగి పొందిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ(CRDA) అధికారులు లేఖలు జారీ చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఇంటింటికి వెళ్తున్న సీఆర్డీఏ సిబ్బంది రైతులకు లేఖలను అందజేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు రిజనబుల్ ప్లాట్లలో దాదాపు 65 శాతం సీఆర్డీఏ రైతులకు రిజిస్టర్ చేసింది. ప్లాట్లు పొందిన రైతులు వాటికి హద్దు రాళ్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఐతే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాలు నిలిచిపోవడంతో రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయి. అప్పుడప్పుడు ఒకటి, అర తప్ప పెద్దగా రిజిస్ట్రేషన్లు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసందే. అనంతరం అమరావతినే రాజధానిగా చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంది.
ఇటీవల హైకోర్టు అమరావతి మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు లేకుండా నిర్మించాలని.. రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అప్పగించాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగి రైతులకు ప్లాట్లను అప్పగిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని.. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు మూడు రోజులు ముందుగా సీఆర్డీఏ వెబ్ సైట్లో స్టాల్ బుక్ చేసుకోవాలని లేఖల్లో పేర్కొన్నారు. రైతులు తమ భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను అందజేసి.. ఈనెల 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరిట లేఖలు జారీ అయ్యాయి. ఈ విషయంలో సందేహాలు ఏమైనా ఉంటే తుళూరు సీఆర్డీఏ కార్యాలయ పనిదినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సంప్రందించాలని లేదా రైతులకు ఏవైనా సందేహాలుంటే, 08645-244774 , 80645-244778 ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈనెల 21న రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నందున జగన్ సర్కార్ ఎలాంటి ముందడుగు వేయబోతున్నది ఆసక్తికరంగా మారింది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.