జగన్ షాక్ ఇచ్చిన సంస్థకు కేసీఆర్ గుడ్ న్యూస్..

జగన్ షాక్ ఇచ్చిన సంస్థకు కేసీఆర్ గుడ్ న్యూస్..

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్(File)

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయా? ఇప్పటికే రాజధాని లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రం.. అభివృద్ధిలోనూ కుంటుపడే అవకాశం ఉందా? అమరావతి రాజధాని కాదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం చర్యలు డెవలప్‌మెంట్‌కు విఘాతం కలిగిస్తాయా?.. అంటే ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, నిపుణులు. వాస్తవానికి.. రాజధాని అమరావతిలో జగన్ సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టును రద్దు చేయడమే పెద్ద తప్పిదంగా జాతీయ మీడియా చెబుతోంది. ఓ ఆంగ్ల జాతీయ పత్రిక దీనిపై కథనం కూడా రాసింది. సీఎం జగన్ ప్రభుత్వ విధానాలు ఆ రాష్ట్రానికి చేటు చేకూరేలా, తిరోగమన దిశగా సాగుతోందని తెలిపింది. ఈ చర్చ సాగుతుండగానే.. పది రోజులు గడవకముందే దుబాయ్‌కి చెందిన లులూ గ్రూప్‌కు కేటాయించిన భూమిని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో పెట్టుబడులను విరమించుకుంటున్నట్లు లులూ సంస్థ ప్రకటించింది. 2018 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ సంస్థకు దాదాపు 14 ఎకరాల భూమిని కేటాయించారు.

  విశాఖపట్నంలోని హార్బరు పార్కు ఏరియాలో.. ఏపీఐఐసీకి చెందిన 10.5 ఎకరాల భూమి, ఆ పక్కనే సీఎంఆర్‌కు చెందిన 3.33 ఎకరాల భూమి.. మొత్తంగా 13.83 ఎకరాల భూమిలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, షాపింగ్‌మాల్‌ ఇతర భవనాలు నిర్మించాలని మ్యాప్ రూపొందించారు. దీనికోసం రూ.2,300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. దానివల్ల దాదాపు 7వేల మందికి ఉపాధి దొరుకుతుందని భావించారు. అయితే.. ఇప్పుడు అక్కడ కేటాయించిన భూమిని జగన్ సర్కారు రద్దు చేయడంతో ఆ సంస్థ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

  అయితే.. ఆంధ్రప్రదేశ్‌కి బదులుగా తెలంగాణలో తాము పెట్టుబడులు పెడతామని ఆ సంస్థ డైరెక్టర్ అనంత్‌రామ్ తెలిపారు. గతంలో ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇప్పటి ప్రభుత్వం రద్దు చేసినందున.. తాము ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొంటున్నామని వెల్లడించారు. ఏపీకి బదులుగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెడతామని వివరించారు. అదీకాక.. స్థానిక యువతకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన ఉండే అవకాశం కూడా ఉందన్న కారణంతో పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సంకోచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

  ఈ సమయంలో.. సింగపూర్ ప్రతినిధులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వారితో చర్చించి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థలకు అన్ని విధాల సహకారం అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అటు తెలంగాణలో సహకారం ఇస్తుండటం.. అటు ఏపీలో ఒప్పందాలు రద్దు చేస్తుండటం.. చూస్తుంటే ఏపీ అభివృద్ధి ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. జగన్ సర్కారు ఏర్పడి కేవలం ఆరు నెలలే పూర్తైంది. ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉన్నందున రాబోయే రోజుల్లో రాష్ట్రాభివృద్ధికి ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలు, ఇతరత్రా అభివృద్ధి దిశగా సాగిస్తాయా? లేదా? అన్నదానికోసం ఎదురు చూడాల్సిందే.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు