ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుకు వీలైన ప్రతి ఎకరానికి సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మరో పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నవరత్నాలు హామీల్లో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు నేడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతున్న ‘వైఎస్‌ఆర్ జలకళ’ పథకం ద్వారా ఉచితంగా బోరుబావులను అందించేందుకు మరో ముందడుగు పడిందని మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో అన్నారు.
వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా బోరుబావుల తవ్వకానికి ముందుగా సంబంధిత పొలంలో భూగర్భజలాల స్థాయిని శాస్త్రీయంగా సర్వే చేసి, ఆ తరువాతే సదరు పాయింట్‌లో డ్రిల్లింగ్ చేపడతారు. సొంతగా 2.5 ఎకరాల పొలం కలిగి వుండి, బోరుబావి లేని రైతులు ఈ పథకం కింద అర్హులు. అయితే ఇంతకంటే తక్కువ భూమి కలిగివున్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే మరికొందరు రైతులతో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉచిత బోరుబావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్నా, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పిస్తున్నారు. రైతులు ఉచిత బోర్‌బావుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ సచివాలయంలో రైతులు చేసుకున్న దరఖాస్తును ప్రాథమికంగా విఆర్‌ఓ పరిశీలించి వాటిని సంబంధిత అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డ్వామా), ఎంపిడిఓలకు పంపుతారు.
భూగర్భ జలాల లభ్యతపై అర్హులైన జియాలజిస్ట్ తో బోర్‌బావులను డ్రిల్లింగ్ చేసే కాంట్రాక్టర్ సర్వే చేయించి, ఫీజుబిలిటీ నివేదికను ఎపిడి, ఎంపిడిఓలకు అందచేస్తాడు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) నుంచి సదరు నివేదిక ఆధారంగా దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. అనంతరం డ్వామా పిడి నుంచి సంబంధిత కాంట్రాక్టర్‌కు డ్రిల్లింగ్ పనిని అప్పచెబుతారు. ఉచిత బోరుబావి కోసం దరఖాస్తు చేసుకున్న రైతుకు తన దరఖాస్తు ఏ దశలో వుందో ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ ద్వారా సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది. బోరుబావి డ్రిల్లింగ్ పూర్తయిన వెంటనే డ్రిల్లింగ్ కాంట్రాక్టర్ సమక్షంలోనే సదరు ప్రదేశం నుంచి లబ్ధిదారుడి ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తారు. ప్రతి బోరుబావి లోతు, వేసిన కేసింగ్ లను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ (ఐఓటి) ద్వారా లెక్కిస్తారు. సాధ్యమైనంత వరకు ఈ లెక్కింపు ప్రక్రియలో మనుషుల ప్రమేయంను తగ్గించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. దీనివల్ల మరింత పారదర్శకంగా, అవినీతి రహితంగా రైతుకు మేలు జరుగుతుంది.
ఆయా జిల్లాలకు సంబంధించిన సక్సెస్ రేటు ఆధారంగా డ్రిల్లింగ్ కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరుపుతారు. వేసిన బోరుబావు ఏ కారణాల వల్ల అయినా విఫలమైతే, అనుకూలతను బట్టి మరో బోరుబావి తవ్వేందుకు అవకాశం వుంది. విజయవంతంగా బోరుబావి తవ్వకం పూర్తియిన చోట సదరు బోరు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా రీచార్జ్ పిట్, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపడతారు. ఈ కార్యక్రమం ద్వారా తవ్విన అన్ని బోరుబావులకు సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. ఈ పథకం నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పిఎంయు)లను ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్ జలకళ పథకం కోసం జారీ చేసిన జీఓలో వివిధ స్థాయిల్లో ఆయా విభాగాలు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై స్పష్టంగా వివరించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకంను అమలు జరుగుతుంది. కలెక్టర్ మార్గదర్శకంలో అన్ని స్థాయిల విభాగాలు పనిచేస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Navaratnalu