AP Grama, Ward Secretariat: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్.. జగన్ కీలక నిర్ణయం

సీఎం జగన్(ఫైల్ ఫొటో)

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ అసిస్టెంటులకు శిక్షణ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. శిక్షణ పూర్తయిన తర్వాత శాఖాపరమైన పరీక్ష నిర్వహించాలన్నారు. ఇందులో క్వాలిఫై అయితేనే వారికి ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తవుతుందని చెప్పారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది పనితీరుపై కచ్చితమైన మానిటరింగ్‌ ఉండాలన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 1902 నంబరును కచ్చితంగా డిస్‌ప్లే చేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లలో ప్రజల సమస్యలు, గ్రీవెన్స్‌ కోసం కూడా ఈ ఏర్పాటు చేయడం ద్వారా సచివాలయాల సిబ్బంది పనితీరుపై ఫీడ్‌ బ్యాక్‌కు ఉపయోగపడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గ్రామ సచివాలయంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ విధులు కూడా నిర్వహించాల్సి ఉన్నందున అందుకు తగిన విధంగా సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఆ గ్రామ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందుతాయన్నారు.

    ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ అసిస్టెంటులకు శిక్షణ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. శిక్షణ పూర్తయిన తర్వాత శాఖాపరమైన పరీక్ష నిర్వహించాలన్నారు. ఇందులో క్వాలిఫై అయితేనే వారికి ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తవుతుందని, ఇందు కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్ష నిర్వహించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విలేజ్‌ లెవల్‌ అగ్రికల్చర్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో అగ్రికల్చర్‌ కమిటీలు ఉన్నందున వాటితో సమన్వయం చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పనితీరు వారి భాధ్యతలపై అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 3.95 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందన్న అధికారులు, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్ధపై ఆరా తీశారని చెప్పారు.

    మరోవైపు నవంబర్ చివరి వారంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సర్కారు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారు సదరు గ్రామ పరిధిలో, అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది మున్సిపాలిటీ లేదా కార్పోరేషన్ పరిధిలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు డివిజనల్‌, మండల స్ధాయి అధికారులు సదరు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలి. ఉద్యోగులు అక్కడే నివాసం ఉంటున్నారో లేదా అనే అంశాన్ని తరచుగా పరిశీలించాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు వందశాతం అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: