ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ (YS Jaganmohan Reddy Bail) రద్దు పిటిషన్ మీద తీర్పును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు (CBI Court in Hyderabad) వాయిదా వేసింది. ఈ రోజు తీర్పు వస్తుందని అందరూ భావించినప్పటికీ ఈ కేసులో తీర్పును సెప్టెంబర్ 15వ (Verdict on Sept 15th) తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరో వైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy) సంబంధించిన బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా అదే రోజు తీర్పు వెలువరించనున్నట్టు సీబీఐ కోర్టు తెలిపింది. అంటే ఒకే రోజు రెండు కీలక తీర్పులు వెలువడనున్నాయి. ఏపీ సీఎంగా ఉన్నత పదవిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, ఆయన తన అధికారారిన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama krishnam raju) సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
రఘురామకృష్ణంరాజు వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ వేయడానికి నిరాకరించింది. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోండి అని సీబీఐ కోర్టుకే నిర్ణయాన్ని వదిలేసింది. సీఎం జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజాయిండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టు విచక్షాధికారానికే వదిలేస్తున్నామని తెలిపారు. బెయిల్ రద్దు చేయాలా? వద్దా? అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజాయిండర్లో పేర్కొన్నారు. దీంతో జగన్, రఘురామ తరపు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించారు.
ఈ పిటిషన్ల మీద సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం ఆగస్టు 25వ తేదీన దీనిపై తీర్పు వెలువరిస్తామంటూ సీబీఐ కోర్టు తెలిపింది. దీంతో 25న ఏం జరుగుతోందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో రేకెత్తించింది. అయితే, సీబీఐ కోర్టు మాత్రం తీర్పును వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ కేసులో జగన్ బెయిల్ రద్దవుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఇంకా కొనసాగనుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి మొత్తం 11 చార్జిషీట్లను సీబీఐ నమోదు చేసింది. వీటిలో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు . ఈ సీబీఐ చార్జిషీట్ల మీద విచారణ పలు దశల్లో ఉంది. ఒక్కో చార్జిషీట్ మీద ప్రత్యేకంగా విచారణ జరుగుతోంది. అన్నీ కలిపి ఒకేసారి విచారించాలని వైఎస్ జగన్ కోరినప్పటికీ కూడా కోర్టు అందుకు అంగీకరించలేదు. ఈ 11 చార్జిషీట్లలోనూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా నిందితుడిగా చేర్చింది సీబీఐ. అయితే, ఆయన ఇటీవల విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ రఘురామ కృష్ణంరాజు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CBI, MP raghurama krishnam raju, Ysrcp