news18-telugu
Updated: November 6, 2020, 5:51 PM IST
మానవత్వమే నా మతం పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా నాడు వైఎస్ జగన్ చూపిన దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ గాందీపథం పక్షపత్రిక ఒక ప్రత్యేక పుస్తకం ప్రచురించింది. ‘మానవత్వమే నా మతం’ అనే పేరుతో ప్రచురించిన ఆ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీపథం పక్షపత్రిక ఆ పుస్తకం ప్రచురించింది. చిన్ననాటి నుంచే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, పాదయాత్రలో ఒక వృద్ధురాలి చెప్పు తెగిపోతే సరిచేసి ఇవ్వడం, ముఖ్యమంత్రిగా ఒక పోలీసు అధికారికి పతకం ప్రదానం చేస్తుండగా, అది జారిపోతే స్వయంగా ఒంగి తీసి ప్రదానం చేయడం, విశాఖ పర్యటనలో కొందరు విద్యార్థులు తమ సహచరుడి అనారోగ్యం గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే వెంటనే ఆగి, వారి సమస్య తెలుసుకుని ఆ విద్యార్థి వైద్య సహాయం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయడం.. వంటి సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన పలు మానవీయకోణ విశేషాలను ‘మానవత్వమే నా మతం’ పుస్తకంలో పొందుపర్చినట్లు గాంధీపథం పక్ష పత్రిక ఎడిటర్ ఎన్. పద్మజ తెలిపారు.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు)ఆర్ ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ ఎన్.పద్మజ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలో వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్ఆర్ ’ ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు వైఎస్ విజయమ్మ తన తొలి పలుకులో తెలిపారు. వైఎస్ఆర్ ఒక తండ్రిగా, భర్తగా ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్ఆర్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో.. విజయమ్మ వివరించారు.
వైఎస్ఆర్ ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును, ఇంట్లోవారి అవసరాలను అర్థం చేసుకున్నట్లే ప్రజలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను కూడా అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్లే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్‌ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో ఆమె వివరించారు. వైఎస్సార్ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపదను తన పిల్లలు, మనవలకే కాకుండా.. ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని విజయమ్మ పేర్కొన్నారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నానని విజయమ్మ తెలిపారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 6, 2020, 5:33 PM IST