Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN TO RELEASE RS 2190 CR INTO FARMERS BANK ACCOUNTS TODAY UNDER YSR RYTHU BHAROSA YSR ZERO INTEREST LOANS AND YSR YANTRA SEVA SCHEME MKS

శుభవార్త: నేడు రైతుల ఖాతాల్లోకి రూ. 2190 కోట్లు -రెండో విడత YSR Rythu Bharosa-PM Kisan, మరో రెండు పథకాల డబ్బు

రైతుల ఖాతాల్లోకి డబ్బులు

రైతుల ఖాతాల్లోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్ లో రైతులకు దీపావళి సంబురాలు ముందస్తుగా వచ్చాయి. అన్నదాత లోగిళ్ళలో ముందే దీపావళి కాంతులు నింపుతూ, ఒకే రోజు మూడు పథకాలకు సంబంధించిన భారీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు.

సంక్షేమ కార్యక్రమాలు, నగదు తోడ్పాటు పథకాల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు రైతులకు మరో శుభవార్త తెలిపింది. మంగళవారం (అక్టోబర్ 26న) రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2190కోట్లు జమచేయనున్నారు. లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా మొత్తం మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను ఇవాళ పంపిణీ చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఆన్ లైన్ లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లనున్నాయి.

మొత్తం మూడు పథకాల ద్వారా ఏపీలోని రైతుల ఖాతాల్లోకి నేడు వేల కోట్లు జమకానున్నాయి. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ. 2,191 కోట్ల లబ్ది చేకురుతుండగా, ఇదివరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,214 కోట్లు సీఎం బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఇలా ఉన్నాయి..

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌
కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద వరుసగా మూడో ఏడాది కూడా అక్టోబర్‌లో ఇవ్వనున్న రెండవ విడతగా 50.37 లక్షల మంది రైతన్నలకు రూ. 2,052 కోట్ల లబ్ది. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 2,052 కోట్లతో కలిపి రెండున్నర సంవత్సరాలలో ఇప్పటివరకు రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం రైతు భరోసా సాయం రూ. 18,777 కోట్లు. మ్యానిఫెస్టోలో చెప్పింది – ఏటా రూ. 12,500 (4 సంవత్సరాలకు రూ. 50,000) కాగా, ఇప్పుడు ఏటా రూ. 13,500(5 సంవత్సరాలకు కలిపి రూ. 67,500) రైతులకు అందుతోంది.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు
ఈ పథకం క్రింద 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 112 కోట్ల వడ్డీ రాయితీ. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేరుగా జమచేస్తారు. చక్రవడ్డీల పద్మవ్యూహంలో చిక్కుకుని అన్నదాతలు అప్పుల ఊబిలో పడిపోకుండా వారికి అండగా నిలుస్తూ ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు ఈ పథకం క్రింద పూర్తి వడ్డీ రాయితీని అందిస్తున్న జగన్‌ ప్రభుత్వం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 1,180 కోట్లతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద చెల్లించిన రూ. 382 కోట్లతో సహా, ఇప్పుడు అందిస్తున్న వడ్డీ రాయితీ రూ. 112.7 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద 62.78 లక్షల మంది రైతన్నలకు రూ. 1,674 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ప్రభుత్వం

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం
వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం క్రింద 1,868 రైతు గ్రూపులకు రూ. 27.17 కోట్ల లబ్ది చేకూరనుంది. సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు, పనిముట్లను అందుబాటులో ఉంచి విత్తు నుండి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,134 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10,750 గ్రామ స్ధాయి యంత్రసేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌), వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి మరియు కృష్ణ, గుంటూరు జిల్లాలలో మండలానికి 5 చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కూడిన క్లస్టర్‌ స్ధాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm jagan, Farmers bank accounts, Ysr rythu bharosa

తదుపరి వార్తలు