గోదావరికి వరద (Godavari Floods) పోటెత్తిన సంగతి తెలిసిందే. జూలై నెలలో గత వందేళ్లలో నమోదుకాని వరద ఈసారి నమోదైంది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్న సందర్భంగా సీఎం ఏరియల్ సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.ఉదయం గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్ అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు.
రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు అధికారులు సీఎంకు తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించారు. దాదాపు 23 –24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆమేరకు పోలవరం వద్దా, ధవళేశ్వరం వద్దా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశించారు.
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలనన్న జగన్., వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
గోదావరి వరద ఉధృతి కారణంగా గోదావరి జిల్లాల్లోలని ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, దేవీపట్నం, చింతూరు, ఏటపాక, నెల్లిపాక, రంపచోడవరం ప్రాంతాల్లోని పదుల కొద్దీ గిరిజన గ్రామాలు జలమయ్యమయ్యాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయింది. గోదావరి నదిలో వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం పూర్తిగా నీటమునిగింది. దిగువన ధవళేశ్వరం బ్యారేజీకి ఇన్ ఫ్లో అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి లంక గ్రామాలన్నీ నీటమునిగాయి.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో నదీపాయల్లోకి వరదనీరు పోటెత్తింది. దీంతో 21 లంక గ్రామాలు నీటమునిగాయి. పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తోంది. అయినవిల్లి, అప్పనపల్లి, కనకాయలంక లంక కాజ్ వేల వద్ద ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి మండలం పొట్టిలంక, కొండుకుదురు లంక, అయినవిల్లి లంక, మడుపల్లి లంక, పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, లంకల గన్నవరం, జొన్నల్లంక శివాయిలంక, చినకందాల పాలెం,వాడ్రేవుపల్లి,నాగుల్లంక, కె.ఏనుగుపల్లి గ్రామాలు పూర్తిగా వరదనీటిలో మునిగాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Floods, Godavari river