ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ (AP CM YS Jagan) తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 22 నుంచి 26వరకు స్విట్డర్లాండ్ (Switzerland) లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ఈ సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు సదస్సుకు హాజరవుతున్నారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
“ప్రజలు , పురోగతి , అవకాశాలు” అనే నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు ఆంధ్రప్రదేశ్ దావోస్ వెళుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే ఆహ్వానం మేరకు హాజరవుతున్న ఏపీ ఈ సారి ప్రత్యేక ప్రణాళిక కసరత్తులతో ఆర్భాటాలు లేకుండా వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతుల ఆధ్వర్యంలో మే 22 నుంచి 26 వరకూ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతుందన్నారు. ఈ వార్షిక సమావేశానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, జూబిలెంట్ గ్రూప్, టాటా సన్స్, హీరో గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, భారతి ఎంటర్‌ప్రైజెస్ వంటి 200 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలిపారు.
జగన్ అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. దావోస్ పర్యటనలో సుమారు 35 గ్లోబల్ కంపెనీలు/ఎంఎన్ సీలు, ప్రపంచ స్థాయి నాయకులు , మేధావులతో శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. 23న తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనకు సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దావోస్ వెళ్తున్నారు. దావోస్ టూర్ లో ఏపీకి ఏమేరకు పెట్టుబడులు వస్తాయి.. ఎలాంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.