ఇసుక రవాణా కాంట్రాక్టులు వారికే.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఇసుక పంపిణీ విధానంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నస్తున్న జగన్ సర్కారు మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ప్రతీ జిల్లాల్లోని 2 వేల మంది నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇసుక రవాణా వాహనాలను ఇప్పించి వారికే ఇసుక కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.

  • Share this:
ఏపీలో ఇసుక పంపిణీ విధానంలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నస్తున్న జగన్ సర్కారు మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ప్రతీ జిల్లాల్లోని 2 వేల మంది నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇసుక రవాణా వాహనాలను ఇప్పించి వారికే ఇసుక కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. దీనిపై త్వరలో మార్గదర్శకాలు సిద్ధం చేయాలని వారిని ఆదేశించారు. ఏపీలో తీవ్ర మల్లగుల్లాల తర్వాత ఇసుక అమ్మకాలు ప్రారంభించిన ప్రారంభించిన జగన్ సర్కారు దీన్ని పటిష్ఠంగా అమలు చేసేలా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తోంది. దీంతో పాటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా సీఎం జగన్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇకపై ప్రతీ జిల్లాల్లో 2 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల యువకులను గుర్తించి వీరికి కాపు కార్పొరేషన్‌తో పాటు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఇసుక రవాణా వాహనాలు అందించనున్నారు.

వీరికే ఇసుక రవాణా కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ఇసుక రవాణాలో అక్రమాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని సీఎం జగన్ ఇవాళ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఇసుక అమ్మకాలు ప్రారంభమైనా ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక పంపిణీలో ఆటంకాలు ఏర్పడటంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణా చేస్తామంటూ ఎవరు ముందుకు వచ్చినా వారికి అవకాశమివ్వాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను తెరవాలని, జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని సూచించారు. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరదలు తగ్గాయి కాబట్టి ఇసుక లభ్యత ఉందని, దాన్ని తక్కువ రేటుకు అందించాలని సీఎం చెప్పారు. వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలని జగన్ ఆధికారులను ఆదేశించారు.

ఇక, రాజకీయ జోక్యాన్ని ఎక్కడా అనుమతించరాదని సీఎం ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా కచ్చితంగా కనిపించాలని అన్నారు. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని, ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని వెల్లడించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదని, ఈ మేరకు చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో అవసరాలకు తగిన ఇసుక లేదన్న విషయం గుర్తించి, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

సయ్యద్ అహ్మద్
న్యూస్18 సీనియర్ కరస్పాండెంట్
First published: