AP CM YS JAGAN SHOCKING DECISION AP CS LV SUBRAMANYAM TRANSFERRED BA
జగన్ షాకింగ్ నిర్ణయం.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు..
ఏపీ సీఎస్ఎల్వీ సుబ్రమణ్యం(ఫైల్ ఫోటో)
ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారు. ఆయనను బాపట్లలో ఉన్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్‌కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ రేసులో నీలం సహానీ, సమీర్ శర్మ ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత కేబినెట్లో ‘వైఎస్ఆర్ అవార్డు’ పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, దానికి సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కానీ, ఆ పనిచేయకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా కేబినెట్లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టు సమాచారం. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఉత్తర్వులను కూడా ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు.
ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తన పైఅధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అధికారాన్ని తనకు కట్టబెట్టుకుంటూ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కూడా చీఫ్ సెక్రటరీ, ప్రవీణ్ ప్రకాష్ మధ్య వివాదం కొనసాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ.. ప్రవీణ్ ప్రకాష్ ఏకంగా బిజినెస్ రూల్స్‌ను మారుస్తున్నారని ఎల్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జీవోలు ఆలస్యం కాకుండా ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ కూడా నేరుగా జీవోలు జారీ చేసే అధికారాలు కల్పిస్తూ ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీవో
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి చీఫ్ సెక్రటరీ పునేఠాను మార్చి.. ఎల్వీ సుబ్రమణ్యంకు బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు నిర్వహించే సమీక్షలకు ఆయన హాజరుకాలేదు. వారి మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రమణ్యంను కొనసాగించారు.
పోలీసుపై న్యాయవాదుల దాడి
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.