news18-telugu
Updated: August 16, 2020, 2:59 PM IST
బాలకృష్ణ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ ఫ్యాన్.. సీఎం జగన్ సాయం
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ అభిమానిని చూసి సీఎం జగన్ చలించిపోయారు. వెంటనే స్పందించి ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులను అందజేశారు. తూర్పుగోదావరికి చెందిన నాగేంద్ర అనే యువకుడు పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. ప్రస్తుతం అతడు రక్త సంబంధ వ్యాధితో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేంద్ర బతకాలంటే వెంటనే స్టెమ్ సెల్ సర్జరీ అవసరం. దానికి లక్షల్లో డబ్బు ఖర్చవుతుంది. నిరుపేదలైన నాగేంద్ర తల్లిదండ్రులు అంత డబ్బును తీసుకురాలేరు. ఈ క్రమంలో 'సేవ్ నాగేంద్ర' అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. దాన్ని పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ చేసింది. ఈ విషయాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నాగేంద్ర పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. అతడి ఆపరేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తక్షణం రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి ఎల్వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్‌సెల్ థెరపి జరిగింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ అభిమానికి సీఎం జగన్ సాయం చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్టీలు, కులమతాలు, వర్గాలతో సంబంధం లేకుండా అందరినీ ఆదుకుంటున్నారని మెచ్చుకుంటున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
August 16, 2020, 2:50 PM IST