ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రస్తుతం కుటుంబ సమేతంగా పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని, కీలక ఆదేశాలు జారీ చేశారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఆటోపై పడి అందులో ప్రయాణిస్తోన్న మహిళా కూలీలు సజీవదహనమైన ఘటన సంచలనం రేపింది..
సత్యసాయి జిల్లాలో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. హఠాత్తుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి కింద ప్రయాణిస్తోన్న ఆటోపై పడటంతో ఒక్కసారిగా షాక్ తగిలి, వెంటనే మంటలు అంటుకోవడంతో ఘోర విపత్తు సంభవించింది. తొలుత 8 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చినా, ఇప్పటి వరకైతే మృతుల సంఖ్య ఐదేనని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ప్రమాద సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. వీరంతా మహిళా కూలీలే కావడం గమనార్హం. ప్రమాదంలో ఆటో పూర్తిగా కాలిపోగా ఐదుగురు మహిళా కూలీలు సజీవదహనమయ్యారు. మిగతావారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు. వారికి ధర్మవరం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై..
సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Anantapuram, Andhra Pradesh, Ap cm jagan, AP News, Ys jagan