ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల కల్పన దిశగానే చదువులు సాగాలని, జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలోని విద్యా సంస్థలను తీర్చిదిద్దాలని నిర్ణయించిన ఆయన, స్కిల్ డెవెలపర్స్ లకు యూనివర్సిటీలను జోడించాలని, విద్యా ప్రమాణాల్లో రాజీపడరాదని అధికారులకు సూచించారు. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గానికో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సోమవారం ఉన్నత విద్యపై జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. భేటీలో సీఎం పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి..
ఏపీలో సాగే చదువులన్నీ జాబ్ ఓరియెంటెడ్ విధానంలోనే ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కోర్సులను ఇంటిగ్రేట్ చేస్తూ, మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ కొనసాగాలని, అప్రెంటిస్‌షిప్ కచ్చితంగా ఉండలన్నారు. పొరపాటున చదువులు అయిపోయినా.. తమకున్న స్కిల్స్ వల్లయినా ఉద్యోగం వస్తుందనే నమ్మకం పిల్లల్లో కలిగేలా పరిస్థితులను మార్చాలన్నారు.
యూనివర్శిటీల్లో టీచింగ్‌స్టాఫ్ నియామకాల కోసం ఇప్పటికే అనుమతిచ్చామన్న సీఎం.. సదరు రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి పక్షపాతాలకు తావుండరాదని అధికారులను హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఏపీలో నడుస్తోన్న ప్రతి యూనివర్సిటీని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపర్చాలని, ఆస్పత్రులను సైతం అదే స్థాయిలో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫీజుల విషయంలో పిల్లలకు, కాలేజీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఠంచనుగా రీయింబర్స్ మెంట్ అందిస్తోన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
వర్సిటీలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో అనుసంధానం చేయాలని, ఒక్కో వర్సిటీలో ఒక్కో రంగానికి సంబంధించిన పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కలిసి పనిచేయాలని, వచ్చే మూడేళ్లలో వర్సిటీలు వేటికవే లక్ష్యాలను రూపొందించుకోవాలని జగన్ అన్నారు. వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో(ఇంగ్లీష్, తెలుగు) టెక్ట్స్‌బుక్స్ అందించాలన్నారు.
కాలేజీల్లో విద్యా ప్రమాణాలపై రాజీపడరాదని, ప్రమాణాలు పాటించని కాలేజీలకు అనుమతులు ఇవ్వరాదని సీఎం జగన్ అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చివరిగా, రాష్ట్రంలో వివాదాస్పదమైన ఎయిడెడ్ కాలేజీల విలీనం అంశంపైనా సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విధానాన్ని కోర్టు గర్హించిన దరిమిలా.. ఏపీలో ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని, కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించాలా వద్దా అన్నది ఆయా సంస్థల ఇష్టమని, ఎవరైనా కాలేజీలను తామే నడుపుకొంటామంటే భేషుగ్గా ఆ పనిచేయొచ్చని, ఇందులో ఎలాంటి బలవంతాలకు తావులేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm jagan, EDUCATION, Ys jagan