విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో సీఎం జగన్ కీలక నిర్ణయం..

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు, పరిహారంపై పరిశీలించిన ఆయన.. మంత్రులు, అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 • Share this:
  విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు, పరిహారంపై పరిశీలించిన ఆయన.. మంత్రులు, అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల్లో మిగతా వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని స్పష్టం చేశారు. ప్రభావిత గ్రామాల ప్రజల వైద్యం కోసం క్లినిక్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రులు లీక్ ఘటన అనంతరం తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు. గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ పనులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం 4 గంటల కల్లా ఇవి ముగుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. బాధితులు చాలామంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మంత్రులంతా ఆ 5 గ్రామాల్లో ఈ రాత్రికి బసచేయాలని ఆదేశించారు. శానిటేషన్‌ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

  ఒక్క విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోని మిగతా పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేయాలని జగన్ ఆదేశించారు. ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించేలా చేయాలని, అదే సమయంలో ప్రమాదకర పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపైనా ఆలోచనలు చేయాలని సూచించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సమీక్షలో పాల్గొనగా.. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యన్నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాస్, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు.

  ఇదిలా ఉండగా, స్టైరిన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని సీఎంకు కలెక్టర్‌ వెల్లడించారు. లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం ఉష్ణోగ్రత 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉందని, సురక్షిత స్థాయిలో ఉందని తెలిపారు. ట్యాంకులోని స్టైరిన్ కూడా దాదాపు 100 శాతం పాలిమరైజ్‌ అయ్యిందని, ఇది కాక ఇంకో ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టైరిన్ ఉందని, దాన్ని దక్షిణ కొరియాకు తరలిస్తున్నామని చెప్పారు. రాబోయే 4, 5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: