ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళలకు సీఎం జగన్ (AP CM YS Jagan) గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వరమిచ్చారాయన. రాష్ట్రంలో కోవిడ్ (Covid-19) పరిస్థితులు, ఆరోగ్యశ్రీ (Arogyasri), దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సీఎం సమీక్షించిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు చెల్లించాలి జగన్ ఆదేశించారు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3వేలే ఇచ్చేవారని ఇప్పుడు దానిని రూ.5వేలకు పెంచాలన్నారు సీఎం. సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న వైద్యసేవలపై సీఎం జగన్ చర్చించారు. ఈ పథకం కింద అందుతున్న వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అధికారులు సీఎంకు వివరించారు. ఆరోగ్యశ్రీలో 2446 ప్రొసీజర్లు కవర్ అవుతున్నాయని తెలిపారు. దీనిపై నిరంతర అధ్యయనం చేయాలి, అవసరాల మేరకు, మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం ఆదేశించారు.
ఆరోగ్య శ్రీ కింద నెలకు రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న అధికారులు.., 104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు, ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.35 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు..అంటే కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాలకోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. ఎవరికీ అసౌకర్యం కలగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసి.. అక్కడి నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్ ద్వారా చెల్లించాలన్నారు.
ఇక రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైనా సీఎం సమీక్ష జరిపారు. కోవిడ్ పరిస్థితులన్నీ పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని అధికారులు చెప్పగా.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. పీహెచ్సీల్లో 977 సెంటర్లలో అభివృద్ధిపనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం చురుగ్గా సాగుతోందని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నందున.., విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్ ప్రవేశాలకోసం కసరత్తు చేస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం చేయాల్సిన పనులు వేగంగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ పై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మరణిస్తున్నారని అధికారులు తెలిపారు. చివరిదశలో గుర్తించి, చికిత్సకోసం భారీగా ఖర్చు చేస్తున్నారని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుందని చెప్పారు. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ గుర్తింపుపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. అందుకోసం విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్సీలను వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలిన్నారు. ఇవి పూర్తయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుంది, క్యాన్సర్ గుర్తింపు సులభంగా జరుగుతుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.